
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎంఆధార్ స్థానంలో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ అధారిత ధృవీకరణ, పేపర్ లెస్ విధానంలో వెరిఫికేషన్, సలువుగా వివరాలు అప్డేట్ చేసుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సుమారు 4 కోట్ల మందికిపైగా ఇప్పటివరకు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇప్పటివరకు కొత్త ఆధార్ యాప్‌ను 4 కోట్ల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు యూఐడీఏఐ అధికారికంగా ప్రకటించింది. ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలు సులువుగా ఒకే క్లిక్‌తో లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, బయోమెట్రిక్ వివరాలు ఈజీగా అప్డే్ట్ చేసుకోవచ్చు. ఈ-ఆధార్ కూడా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గతంలో వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే పట్టణాల్లో ఉండే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా అన్నీ పనులు నిర్వహించుకోవచ్చు. దీని వల్ల సమయం, డబ్బులు రెండూ ఆదా అవుతాయి. దీంతో ఈ కొత్త యాప్‌కు ఆదరణ పెరిగింది. ప్రజలు ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా సులువుగా తమ వివరాలను అప్డేట్ చేసుకుంటున్నారు.

అయితే ఇటీవల ఈ యాప్‌లో కొత్తగా ఈమెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునే ఫీచర్ యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్ సేవా కేంద్రాలు, యూఐడీఏఐ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది.

జులై 1వ తేదీ నుంచి ఉచిత సౌకర్యం అందుబాటులోకి తీసుకురాగా.. డిసెంబర్ 31వ తేదీ వరకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఈమెయిల్ అప్డేట్ కోసం రూ.75 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేవారికి ఈ రుసుంను మాఫీ చేయనుంది. దీంతో ఆధార్ కార్డు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది.