
ఆధార్ కార్డును ప్రజలు సురక్షితంగా వాడుకునేందుకు యూఐడీఏఐ అనేక మార్పులు తీసుకొస్తోంది. భద్రత కోసం అనేక కొత్త పద్దతులను అనుసరిస్తోంది. ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకుని ప్రజల డేటాకు భద్రత కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఏం సైజులో ఉండే పీవీసీ కార్డులను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరూ పీవీసీ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గతంలో రూ.25 ఫీజు ఉండగా.. ఇప్పుడు రూ.75కు పెంచారు. ఎన్నిసార్లైనా ఈ కార్డును పొందవచ్చు. దీనికి ఎలాంటి లిమిట్ అనేది విధించలేదు. ఒక్క కార్డ్ పోతే మరో పీవీసీ కార్డును పొందే అవకశముంది

మీరు యూఐడీఏఐ వెబ్ సైట్లోకి వెళితే అప్లై ఫర్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పీవీసీ కార్డును ఇండియన్ పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపుతారు. మీ కార్డు డెలివరీకి ఇచ్చారా.. లేదా అనే వివరాలను యూఐడీఏఐ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

ఇక కార్డు డెలివరీకి ఇచ్చాక నెంబర్ ఆధారంగా ఇండియా పోస్ట్ వెబ్‌సైట్లోకి వెళ్లి మీ కార్డు ఎక్కడివరకు వచ్చిందనే వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే కార్డు ప్రింట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా వేగంగా పంపుతామని తాజాగా యూఐడీఏఐ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

ఇండియా పోస్ట్ ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా పీపీసీ కార్డ్ డెలివరీ వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. పీవీసీ కార్డ్ వాడటం చాలా సురక్షితమని యూఐడీఏఐ తెలిపింది. వినియోగదారులందరూ పొందాలని సూచించింది.