EV Charging Points: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీ) వినియోగం పెంచే దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఈ వాహనాల తయారీలో దూకుడు పెంచిన టాటా కంపెనీ.. వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
హెచ్‌పీసీఎల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే ఈవీ రంగంలో తనదైన ముద్ర వేసిన టాటాపవర్.. ఈవీ ఛార్జింగ్‌ల సొంత నెట్‌వర్క్ కలిగి ఉంది. టాటాపవర్‌కు దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాలలో ఐదువందల పబ్లిక్ ఛార్జర్స్ పాయింట్లు ఉన్నాయి. పెట్రోల్ పంపులు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌మాల్స్, థియేటర్లు, జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేసింది.
ఇందులో పబ్లిక్ ఛార్జింగ్, కాప్టివ్ ఛార్జింగ్, ఇల్లు, పని ప్రదేశాలలోచార్జింగ్ చేసుకునే సదుపాయంతో పాటు బస్సుల కోసం అల్ట్రారాపిడ్ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం ఓ ముందడుగుగా టాటాపవర్ భావిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్‌పీసీఎల్ పంపుల వద్ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను కల్పించనుంది.
హెచ్‌పీసీఎల్‌కు 18 వేల రిటైల్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ రంగంలో నైపుణ్యంతో పాటు ధృఢమైన స్థానం ఉన్న టాటాపవర్స్ భాగస్వామ్యం. జాతీయస్థాయి పర్యావరణ ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించనుంది. దీంతో పాటు ఎండ్ టు ఎండ్ పరికరాలకు వేదికగా కానుందని హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయికుమార్ సూరి పేర్కొన్నారు.