
గత కొన్ని నెలలుగా బంగారం ధర పెరుగుదల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధర దూసుకెళ్లింది. దాంతో పాటే వెండి ధర కూడా ఆకాశాన్ని తాకింది. అక్టోబర్‌లో రూ.2 లక్షలు దాటేసిన వెండి ధర గత కొన్ని రోజులుగా తగ్గుతూ నవంబర్ 11న మళ్లీ పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.69 లక్షలకు చేరింది.

దీంతో మళ్లీ వెండి ధరల పెరుగుదల ర్యాలీ కొనసాగుతుందేమో అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' ఓ సంచలన అంచనాను వెల్లడించారు. ప్రస్తుతం సిల్వర్ 50 డాలర్లు దాటేసింది.. ఇక నెక్ట్స్ స్టాప్ 72 డాలర్లా అంటూ ఒక డౌట్ వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్ కమోడిటీ మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఇప్పుడున్న ధర కంటే మరో 45 శాతం ధర పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కియోసాకి వెల్లడించారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

ప్రధానంగా వెండిని కేవలం ఆభరణాలు, అలంకార సామాగ్రిగా మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ ఇప్పుడు కీలకంగా మారింది. వెండిని పారిశ్రామిక రంగాల్లో కూడా వినియోగిస్తున్న కారణంగా వెండికి డిమాండ్ అమాంతం పెరుగుతుంది.

ఇలా అన్ని కారణాలు కలిసి వెండి ధర భవిష్యత్తులో మరింత దూసుకెళ్లే అవకాశం ఉంది. వెండి ధర భారీగా పెరుగుతుందని కియోసాకి కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. ఆయన చెప్పినట్లు వెండి ధర గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగింది. ఇప్పుడు ఆయన ట్వీట్‌తో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు బలపడుతున్నాయి.