ఎవరూ క్లెయిమ్ చేయని రూ.35,012 కోట్ల డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023 ఫిబ్రవరి నాటికి బదిలీ చేశౄమని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ వెల్లడించారు. అవి 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లు అని, ఆ మొత్తం 10.24 కోట్ల ఖాతాలకు చెందినవని మంత్రి లిఖిత పూర్వకంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. అయితే అందులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 8,086 కోట్లతో అత్యధిక క్లెయిమ్ చేయని డిపాజిట్లకు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
దీని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 3,904 కోట్ల ఉన్నాయని తెలిపారు. కాగా, పనిచేయని ఖాతాలకు చెందిన వినియోగదారుల ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాలని రిజర్వ్‌బ్యాంక్ సూచించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వెబ్‌సైట్లో పేర్కొంది.
వారు మరణిస్తే వారి కుటుంబాలు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ఎస్‌బీఐ అధికారులు ఎటువంటి సహాకారం అందించడం లేదా..? సంబంధిత మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించినా కూడా క్లెయిమ్ చేసుకునేందుకు కుటుంబీకులను అనుమతించడం లేదా అని సభ్యులు మంత్రిని ప్రశ్నించారు. అయితే డిపాజిట్ క్లెయిమ్ కేసులను పరిష్కరించేందుకు బ్యాంకులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయని మంత్రి సమాధానం ఇచ్చారు.
రెండేళ్లుగా ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలకు సంబంధిత ఖాతాదారులు లేదా చట్టపరమైన వారసుల ఆచూకీ కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని కూడా బ్యాంకులకు సూచించినట్లు మంత్రి తెలిపారు.
ఇంకా బ్యాంకులు తమ సంబంధిత వెబ్‌సైట్లలో ఖాతాదారుల పేర్లు, చిరునామాలను కలిగి ఉన్న జాబితాతోపాటు పదేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్లెయిమ్‌ల జాబితాను అందించాలని బ్యాంకులను ఆదేశించినట్లు చెప్పారు.