
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా రూ.2,000 విడుదల చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తుంది.

ఇప్పుడు మీడియాలో ప్రచురించబడిన నివేదికల ప్రకారం.. 14 వ విడత మే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. మే రెండో వారంలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి . పీఎం కిసాన్ యోజన 14వ విడత మే 3వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులను ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు విడుదల చేస్తుంది . ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒక విడత, ఆగస్టు నుంచి నవంబర్ వరకు మరొక విడత, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడవ విడత పీఎం కిసాన్ పథకం వాయిదాలను విడుదల చేస్తుంది.

లబ్ది పొందిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో మొత్తం రూ .6,000 అందజేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం దీనికి అదనంగా మరో రెండు వాయిదాలు ఇవ్వనుంది. అంటే కర్ణాటకలోని లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదిలో రూ .10,000 జమ అవుతాయి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇది చిన్న రైతుల వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ. మొదట్లో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం పరిమితమైంది. ఇప్పుడు రైతులందరికీ వర్తింపజేశారు.