
అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా రుణం గురించే ఆలోచిస్తారు. గతంలో రుణం అంటే బ్యాంకులే ప్రధాన మార్గం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అయిన NBFCలు కూడా వేగంగా రుణాలను అందిస్తూ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, వ్యాపార విస్తరణ కోసం నిధులు వంటి అనేక అవసరాలకు ఇవి సులభంగా డబ్బు అందిస్తున్నాయి. అయితే వినియోగదారులలో ప్రధాన సందేహం ఒక్కటే బ్యాంకు నుండి రుణం తీసుకోవడం మంచిదా? లేక NBFCలను ఆశ్రయించడం బెటరా? అని.

బ్యాంకులు పూర్తిగా నియంత్రిత ఆర్థిక సంస్థలు. ప్రజల నుండి పొదుపు, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో డబ్బును సేకరించి, అదే నిధులను రుణాలుగా ఇస్తాయి. డిపాజిటర్ల డబ్బు భద్రత కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నియమాలను అమలు చేస్తుంది. మరోవైపు NBFCలు కూడా రుణాలు ఇస్తాయి కానీ సాధారణ బ్యాంకుల మాదిరిగా సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలను నిర్వహించలేవు. అందువల్ల వాటిపై నియంత్రణ కొంత భిన్నంగా ఉంటుంది.

రుణం మంజూరులో బ్యాంకులు సాధారణంగా కఠిన వైఖరిని అనుసరిస్తాయి. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, సిబిల్ స్కోర్ వంటి అంశాలను పూర్తిగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లేదా ఉద్యోగంలో కొత్తవారైనా రుణం తిరస్కరించే అవకాశం ఉంటుంది. కానీ NBFCలు ఈ విషయంలో కొంత సడలింపు చూపిస్తాయి. స్వయం ఉపాధి పొందేవారికి, మొదటిసారి రుణం తీసుకునేవారికి కూడా అవకాశాలు కల్పిస్తాయి. డిజిటల్ ప్రక్రియల కారణంగా రుణం ఆమోదం కూడా వేగంగా జరుగుతుంది.

వడ్డీ రేట్ల విషయంలో మాత్రం బ్యాంకులకు ఆధిక్యం ఉంటుంది. ప్రజల డిపాజిట్ల ద్వారా తక్కువ ఖర్చుతో నిధులు సమీకరించగలగడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వగలుగుతాయి. NBFCలు మార్కెట్ నుండి అధిక రేట్లకు నిధులు తెచ్చుకోవాల్సి రావడంతో వాటి రుణాలపై వడ్డీ కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అయితే కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, ఇతర నిబంధనలను కూడా జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.

చివరికి ఏది మంచిదన్నది పూర్తిగా వినియోగదారుడి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. పత్రాలు సక్రమంగా ఉండి, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఉత్తమ ఎంపిక. కానీ అత్యవసర నిధులు అవసరమై, బ్యాంకు నిబంధనలకు సరిపోని పరిస్థితుల్లో NBFCలు వేగవంతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడవచ్చు. అయితే ఎక్కడి నుంచైనా రుణం తీసుకునే ముందు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడం అత్యంత ముఖ్యం.