
దేశంలో లక్షలాదిమంది తరచూ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు. ట్రైన్లలో రద్దీ ఎక్కుగా ఉంటుంది కనుక నెల రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యవసర ప్రయాణం చేయాలనుకునేవారు ముందురోజు విడుదల చేసే తత్కా్ల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా రిలీజ్ చేసిన నిమిషాల్లోనే బుక్ అయిపోతాయి

అయితే తత్కాల్ టికెట్ల బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని పాటించనుంది. అదేంటంటే.. టికెట్ల బుకింగ్‌కు టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ముందుగా టోకెన్లను జారీ చేశారు. ముందుగా వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో దీనిని అమలు చేయనున్నారు. కేవలం ఆఫ్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ కొత్త విధానం వర్తిస్తుంది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. తమ కోసం లేదా కుటుంబసభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు కేటగిరీ ఏలోకి వస్తారు. ఇక ఇతరులకు టికెట్లు బుక్ చేయాలనుకునేవారు కేటగిరీ బీ కిందకు వస్తారు. కేటగిరీ ఏ కింద ఉన్నవారు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు టికెట్లు బుక్ చేస్తారు.

ఇక కేటగిరీ ఏ ప్రయాణికులకు టికెట్లు బుకింగ్ పూర్తయిన తర్వాతనే కేటగిరీ బీ వారికి టికెట్లను బుకింగ్ చేస్తారు. కేటగిరీ బీ కింద ఉన్నవారు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇక ముందుగా జారీ టోకెన్లపై ప్రయాణికుడు పేరు, ఇతర వివరాలు ఉంటాయి. దీని వల్ల క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే అధికారులు టికెట్లను బుకింగ్ చేస్తారు.

తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఈ కొత్త విధానం తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో అన్ని డివిజిన్ల పరిధిలో దీనిని ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆన్‌లైన్ ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అవి యాధావిధంగా కొనసాగుతాయి.