
రైళ్లల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రైన్లలో ప్రయాణం చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రైన్లలో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ప్రయాణికుల సౌలభ్యం, రైళ్ల నిర్వహణ కోసం రైల్వేశాఖ అనేక నిబంధనలు విధిస్తూ ఉంటుంది. వీటి గురించి చాలామందికి అవగాహన అనేది ఉండదు.

పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా రైళ్లల్లో చాలామంది వెళుతుంటారు. ఇలాంటప్పుడు ఒక ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. పిల్లలకు టికెట్లు తీసుకోవాలా..? ఎన్ని ఏళ్లలోపు పిల్లలకు టికెట్లు అవసరం లేదు? అనే విషయం తెలియక తికమకపడుతుంటారు. ఇందుకు రైల్వేశాఖ నిబంధనలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ అవసరం లేదు. 0 నుంచి 4 సంవత్సరాల మధ్య ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వారికి ప్రత్యేకమైన బెర్త్ అంటూ ఉండదు. తల్లిదండ్రులతో పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పిల్లలకు ప్రత్యేక బెర్త్ కావాలనుకుంటే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలకు సౌకర్యవంతంగా ఉండాలంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఇక 5 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ వీరికి కూడా ప్రత్యేక సీటు, బెర్త్ అంటూ కేటాయించరు. ప్రత్యేక సీటు కావాలనుకుంటే ఫుల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక 12 సంవత్సరాల కంటే ఎక్కువుంటే పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో పిల్లల వయస్సును సరిగ్గా నమోదు చేయాలి.

తప్పుగా వయస్సు నమోదు చేస్తే టికెట్ తనిఖీ చేసే సమయంలో టీటీఈ జరిమానా విధిస్తారు. పిల్లల వయస్సుకు సంబంధించి టీటీఈకు అనుమానం వస్తే ఫ్రూఫ్ ఎప్పుడైనా అడగొచ్చు. దీంతో డేట్ ఆఫ్ బర్త్ లాంటివి వెంట తీసుకెళ్లడం మంచిది. అయితే దూరపు ప్రయాణాలు చేసే సమయంలో పిల్లలకు ప్రత్యేక టికెట్ బుక్ చేయడం మంచిది. దీని వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు.