
బ్యాంక్ అకౌంట్‌లో కొన్నేళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకుండా వదిలేస్తే ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు ఆ అకౌంట్‌ను వినియోగించుకోలేరు. ఇనాక్టివ్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రన్సాక్షన్లు చేయలేరు. అయితే అందులోని నగదు మాత్రం ఎక్కడికీ పోదు. ఎన్ని సంవత్సరాలు దాటినా మీ అకౌంట్లో నిధులు ఉంటాయి. మీరు ఇలాంటి అకౌంట్లలోని డబ్బులను చెక్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక పోర్టల్ ఆర్బీఐ తీసుకొచ్చింది.

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు-గేట్ వే టు యాక్సెస్ ఇన్పర్మేషన్ పోర్టల్(UDGAM) తీసుకొచ్చింది. UDGAM వెబ్ సైట్ ద్వారా ఇనాక్టివ్ అయిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, వాటిల్లో నగదు ఉందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లలోని నగదును చట్టబద్దమైన వారసులు తీసుకోవచ్చు. 10 ఏళ్లు దాటినా క్లెయిమ్ చేయని బ్యాంక్ అకౌంట్లలోని నగదును డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేనెస్ ఫండ్‌కు ఆర్బీఐ తరలిస్తుంది.

మార్చి 2021 నాటికి ఈ ఫండ్‌లో రూ.39,264.25 కోట్లు ఉన్నాయి. మార్చి 31,2020 నాటికి రూ.33,114 కోట్లు ఉండగా.. మార్చి 2019 నాటికి రూ.18,381 కోట్లు ఉన్నాయి. DGAM పోర్టల్‌లో ఖాతాదారుడి పేరు, అడ్రస్, చివరి ట్రాన్సక్షన్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు. ఆర్బీఐ ఆధ్వర్యంలో ఈ పోర్టల్ నడుస్తోంది. అన్ని బ్యాంకులకు సంబంధించిన అన్ క్లెయిమ్స్ డిపాజిట్ల వివరాలను తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకు DGAM పోర్టల్‌ను సుమారు 44 లక్షల సార్లు సెర్చ్ చేశారు. మరణించిన వ్యక్తి డిపాజిట్ల వివరాల గురించి చట్టబద్దమైన వారసులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి వారసులు ఎలా తెలుసుకుంటారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. బ్యాంకులు సమాచారం ఇచ్చినా.. పోస్టాఫీసులు, బీమా పాలసీలలో జమ అయ్యే డిపాజిట్ల సంగతేంటి అన్నారు.

పోస్టాఫీసులు, ఇతర బీమా కంపెనీల్లో డిపాజిట్ల గురించి తెలుసుకునేందుకు ఏకీకృత వ్యవస్ధ లేదన్నారు. చట్టబద్దమైన వారసులు సమాచారం అంతా ఒకేచోట తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. వారం రోజుల్లో కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలిపారు. దీంతో తదుపరి విచారణను మే 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.