ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన శాలరీపై 1.16 శాతం అనదంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని యజమాని వాటా నుంచే తీసుకోనున్నట్లు ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది.
అధిక పెన్షన్ దరఖాస్తుల గడువును పెంచిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఫించను స్కీమ్ కింద అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. రూ.15 వేలకు మించి వేతనంపై 1.16 శాతం అదనంగా చెల్లించాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది.
అంటే హయ్యర్ పెన్షన్ కోసం ఉద్యోగులు ఇక 1.16 శాతం అదనంగా చెల్లించాల్సిన పని లేదు. ఈ మొత్తాన్ని యజమాని వాటా నుంచే తీసుకుంటామని వెల్లడించింది ఈపీఎఫ్ఓ.
ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. ‘ఎంప్లాయిస్ ప్లావిడెంట్ ఫండ్‌కి యాజమాన్యాలు ఇచ్చే వాటా 12 శాతంలోనే అధిక పెన్షన్ కోసం 1.16 శాతం అదనపు చెల్లింపులను ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌కు జమ చేస్తాం’ అని వెల్లడించింది కార్మిక శాఖ.
దాంతో హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. రూ.15 వేలకు మించి వేతనంపై ఇక 1.16 శాతం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనను సవరిస్తున్నట్లు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది కార్మిక శాఖ.
సాధారణంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ నిధికి యజమానుల వాటా కింద జమ అయ్యే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.
తాజాగా ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయంతో ఈపీఎస్‌కు యజమాని వాటా ప్రస్తుతం ఉన్న 8.33 నుంచి 9.49కు చేరనుంది. దీంతో ఉద్యోగి ఈపీఎఫ్‌కు చేరే వాటా తగ్గిపోనుంది.