Family Health Insurence: కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలు రెట్టింపు అయ్యాయి. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని వారు కరోనా కాలంలో చాలా మంది పాలసీలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఆరోగ్య బీమా పాలసీలు ప్రధానంగా మూడు రకాలు. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు. ఇందులో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ వ్యక్తిగత కవరేజీని మాత్రమే కలిగి ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా మొత్తం కుటుంబ సభ్యులకు వర్తించేలా ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది.
సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాలో 60 ఏండ్లకు పైబడినవారికే కవరేజీ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులకూ ఇది వర్తిస్తుంది. ఫిజికల్, సైకలాజికల్ అవసరాలకు తగ్గట్టుగా ఖర్చులు కవర్ అవుతాయి. ఒకరి పేరు మీద తీసుకునే జీవిత బీమా.. అతని మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
జీవిత బీమా ద్వారా వచ్చే డెత్ బెనిఫిట్‌పై ఆదాయం పన్ను (ఐటీ) ఉండదు. మరో విధంగా చెప్పాలంటే ఎలాంటి కోతలు లేకుండా బీమా మొత్తాన్ని అందిస్తారు. జీవిత బీమా ప్రధానంగా రెండు రకాలు. ఒకటి హోల్ లైఫ్, రెండోది యూనివర్సల్ లైఫ్.
హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో కచ్చితమైన బీమా మొత్తాన్ని కలిగి ఉంటుంది. యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం చెల్లింపులు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. కంపెనీల్లో ఉద్యోగంలో చేరిన వెంటనే మేనేజ్‌మెంట్లు మీకు కార్పోరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆఫర్ చేస్తాయి. నెలనెలా కొంత మొత్తాన్ని జీతంలోనే మినహాయించుకుంటూ ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా భరోసాను కల్పిస్తాయి. అయితే దీని విలువ కేవలం రెండు నుంచి ఐదు లక్షల వరకే ఉంటుంది.
హోదానుబట్టి కాస్త పెరగవచ్చు. మీతోపాటు మీ భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకూ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుంది. అయినప్పటికీ మీకు, మీ కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ఆరోగ్య బీమాలు ఉండటం అవసరం. కుటుంబం మొత్తంగా ఒకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అందరికి వర్తించేలా ఉంటుంది.