Cooking Oil: పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. ఇందులో వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే దిగి వచ్చిన వంట నూనె ధరలు.. మున్ముందు మరింతగా దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వంట నూనె దిగుమతిపై విధించే సుంకంలో కోత విధించింది. నూనె దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5 శాతం తగ్గించింది. ఈ నిర్ణయంతో పండగ సీజన్‌లో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.
సెప్టెంబర్ 30 వరకు ముడి పామాయిల్ పై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 30.25 నుంచి 24.7 శాతానికి తగ్గించగా, శుద్ది చేసిన పామాయిల్ దిగుమతి సుంకాన్ని 41.25 శాతం నుంచి 35.75 శాతానికి తగ్గించింది. ఇక సన్‌ప్లవర్ నూనెపై దిగుమతి సుంకం కూడా సెప్టెంబర్ చివరి నాటికి 45 శాతం నుంచి 37.5 శాతానికి తగ్గించబడింది.
ఈ నెలాఖరు నాటికి కొత్త ఖరీఫ్ పంట రాకతో ప్రపంచ మార్కెట్లలో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. కేంద్ర తీసుకున్న చర్యలతో వంట నూనె ధరలు దిగివస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే తాజాగా సుంకాన్ని తగ్గిండచంతో ధరలు తగ్గనున్నాయి. మున్ముందుకు కూడా మరింత ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.