Budget 2025: ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్ రూ. 5 లక్షలు!
Budget 2025: దేశ రైతుల కోసం మోడీ ప్రభుత్వం రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపడుతూనే ఉంటుంది. వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..
Follow us on
2025 బడ్జెట్లో రైతులకు పెద్ద ఊరటనిచ్చే వార్తలు ఉండవచ్చు. వచ్చే ఫిబ్రవరి 1 బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పరిమితిలో చివరి మార్పు చాలా కాలం క్రితం జరిగిందని, ప్రభుత్వం నిరంతర డిమాండ్లను స్వీకరిస్తూనే ఉందని, రైతులకు మద్దతు ఇవ్వడం, గ్రామీణ డిమాండ్‌ను పెంచడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. అందువల్ల ప్రభుత్వం కేసీసీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం సుమారు 26 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయం, సంబంధిత పనులు చేసే రైతులకు 9 శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు అందిస్తారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం రుణంపై వసూలు చేసే వడ్డీపై 2 శాతం రాయితీని కూడా ఇస్తుంది. అదే సమయంలో మొత్తం రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా మరో 3 శాతం రాయితీ ఇస్తారు. అంటే ఈ రుణాన్ని రైతులకు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే ఇస్తారు. జూన్ 30, 2023 నాటికి, అటువంటి రుణాలు తీసుకున్న వారి సంఖ్య 7.4 కోట్లకు పైగా ఉంది. 8.9 లక్షల కోట్లకు పైగా బకాయిలు కనిపించాయి.
మీడియా నివేదికలలో ఫిన్‌టెక్ సంస్థ అడ్వారిస్క్ సహ వ్యవస్థాపకుడు, CEO విశాల్ శర్మ ప్రకారం, వ్యవసాయ వ్యయం గణనీయంగా పెరిగింది. దీనికి విరుద్ధంగా చాలా కాలంగా రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంపుదల లేదు. బడ్జెట్లో కెసిసి పరిమితిని పెంచినట్లయితే, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతోపాటు వ్యవసాయ ఆదాయం కూడా పెరుగుతుంది. దీని వల్ల రైతుల జీవన విధానంలో మార్పుతో పాటు రుణాన్ని కూడా సకాలంలో చెల్లించే అవకాశం ఉంటుంది.
చిన్న రైతులకు ఉపశమనం కలిగించడమే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉద్దేశమని నాబార్డ్ చైర్మన్ షాజీ కెవి బిజినెస్ స్టాండర్డ్ నివేదికలో తెలిపారు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాకుండా సంబంధిత పనులు కూడా చేయాలన్నారు. వారికి కూడా సబ్సిడీ రుణాల అవసరం చాలా ఎక్కువ. తద్వారా వారి ఆదాయం కూడా పెరుగుతుంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నాబార్డు, ఆర్థిక సేవల శాఖ సహకారంతో ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా పశుపోషణ, చేపల పెంపకం చేసే వారు కూడా రుణాలు పొందవచ్చు.
ఈ ప్రచారంలో బ్యాంకులు, గ్రామీణ ఆర్థిక సంస్థలను చేర్చినట్లు షాజీ కెవి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మత్స్యకారులను నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. రైతుల నమోదు తర్వాత బ్యాంకులు రుణాలు అందించమని కోరవచ్చు. నాబార్డ్ డేటా ప్రకారం, అక్టోబర్ 2024 వరకు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా 167.53 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. వీరి మొత్తం రుణ పరిమితి రూ.1.73 లక్షల కోట్లు. పాడి రైతులకు 11.24 లక్షల కార్డులు జారీ చేయబడ్డాయి. దీని పరిమితి రూ. 10,453.71 కోట్లు. అందులో 65,000 కిసాన్ క్రెడిట్ కార్డులు మత్స్యకారులకు జారీ కాగా, దీని పరిమితి రూ. 341.70 కోట్లు.