
ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2 వేలకుపైగా సర్వీసులను నిలిపివేయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైలెట్ల ఒత్తిడిని తగ్గించేందుకు వారికి విశ్రాంతి, పనివేళలు, సెలవులకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. దీని వల్ల పైలట్ల కొరత ఏర్పడటంతో ఇండిగో సర్వీసుల్లో సమస్య ఏర్పడింది.

కేంద్రం స్పందించి ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో విచారణకు ఆదేశించింది. దీంతో ఇండిగో అప్రమత్తమై వెంటనే సర్వీసులను పునరుద్దరించే ప్రక్రియ స్టార్ట్ చేసింది. 10 రోజుల్లో పరిస్థితిని చక్కబెడతామని ఇండిగో ప్రకటించింది. అయితే మరింత సమయం పట్టే అవకాశముందని అంటున్నారు.

ఈ క్రమంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా పైలట్ల నియామాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అనుభవజ్ఞులైన బీ737, ఏ320 పైలట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. డిసెంబరు 22వ తేదీలోపు అప్లై చేసుకోండి’’ అంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఎయిరిండియా ప్రతీ విమానానికి 5.4 మంది పైలట్ల చొప్పున ఉన్నారు.

అటు ఇండిగో కూడా సంక్షోభం నుంచి వెంటనే బయటపడేందుకు పైలట్ల రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించింది. డిసెంబర్ నాటికి 742 మంది పైలట్లను నియమించుకోనుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 158 మందిని నియమించుకోనుంది. మొత్తం 900 మంది పైలట్లను కొత్తగా నియమించుకుంటామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఇండిగో ఇప్పటికే 250 మంది జూనియర్ ఫస్ట్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తోంది. వచ్చే 12 నెలల్లో మొత్తం 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ అధికారులను ఇండిగో నియమించుకోనుంది.