
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు సులువుగా స్మూతీస్ చేసుకోవచ్చు. ఇది త్వరగా తయారవడమేకాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది. శరీరానికి పోషకాల కొరత రానివ్వదు. శీతాకాలంలో స్మూతీస్ చేయడానికి పండ్లు, కూరగాయలు, పెరుగుతో ఈ కింది ప్రత్యేక పదార్ధాలు కూడా స్మూతీలలో కలిపారంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

స్మూతీస్‌లో దాల్చిన చెక్క పొడిని కలపవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి, చలికాలంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చినచెక్క శరీర మంటను తగ్గించడానికి, అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి కూడా సహాయపడుతుంది.

స్మూతీస్‌లో అల్లం కూడా జోడించవచ్చు. చలికాలంలో అల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే, అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.

రుచి కోసం స్మూతీలో తేనెను జోడించవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, తేనెలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్మూతీలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకోవచ్చు. ఈ మసాలాలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇందులో మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందువల్లనే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

స్మూతీస్‌లో గుమ్మడి గింజలను కలపవచ్చు. ఈ గింజల్లో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.