
బత్తిని కుటుంబ కథనం ప్రకారం, వారి పూర్వీకుడు ఆరు తరాల ముందుకు చెందిన బత్తిని వీరన్న గౌడ్ వద్ద హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని సుమారు రెండు వారాల పాటు ఆశ్రయం పొందారు. వీరన్న గౌడ్ సేవాభావానికి మెచ్చిన ఆ ముని చేప ప్రసాదం తయారీ రహస్యాన్ని అందించడంతో పాటు కొన్ని కఠినమైన నియమ నిబంధనలను కూడా విధించారు. అప్పటి నుంచి దాదాపు 190 సంవత్సరాలుగా అదే సంప్రదాయాలు, నియమాలను పాటిస్తూ ప్రసాదం తయారు చేస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి, పంతులుగారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభం కానుంది చేప ప్రసాదం పంపిణీ. అయితే ప్రసాదం తయారీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం రెండు నెలల ముందే మొదలవుతాయని తెలిపారు.చేప ప్రసాదం తయారీకి ఉపయోగించే ఫార్ములా కుటుంబంలోని కేవలం నలుగురికే తెలుసని బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ తయారీ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ, అసలు రహస్యం మాత్రం ఎంపిక చేసిన అర్హులకే చెబుతారని తెలిపారు.కుటుంబ పెద్దలు సేవాగుణం, బాధ్యత, ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించి తదుపరి తరానికి చెందిన వ్యక్తులను ఎంపిక చేస్తారని, అర్హులుగా భావించిన తర్వాతే తయారీ రహస్యం వెల్లడిస్తారని చెప్పారు.

ప్రసాదం తయారీలో ఉపయోగించే వనమూలికలను 400 నుంచి 500 కిలోల వరకు ప్రత్యేకంగా నూరుతారు. ఇందుకోసం ఉపయోగించే "అమంద హస్త" అనే చిన్న రోలు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. వనమూలికలు నూరే సమయంలో విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుందని చెప్పారు.ముని విధించిన నియమాల ప్రకారం చేప ప్రసాదం తయారీ హైదరాబాద్‌లోని దూద్‌బౌలిలో ఉన్న బత్తిని కుటుంబ ఇంటిలోనే జరగాలి. ఆ ఇంటిలోని బావి నీటినే ఉపయోగించాలనే కచ్చితమైన నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రతి ఏడాది మొదటి ప్రసాదం కూడా ఆ ఇంటిలోనే పంపిణీ చేసి, అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలకు అందిస్తారు. చివరి ప్రసాదం కూడా తిరిగి అదే ఇంటిలో అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

చేప ప్రసాదం తయారీకి ముందు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. జూన్ 7న జరిగే పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.చేప ప్రసాదం ఫార్ములా కోసం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని బత్తిని కుటుంబం తెలిపింది. కొందరు బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చారని, అయినప్పటికీ ముని నియమం ప్రకారం ఇది పూర్తిగా సేవగా మాత్రమే కొనసాగించాలనే ఉద్దేశంతో ఫార్ములాను ఎప్పుడూ వెల్లడించలేదని స్పష్టం చేశారు.

ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడేవారు చేప ప్రసాదాన్ని కనీసం ఐదు సంవత్సరాల పాటు వరుసగా తీసుకోవాలని తాము సూచిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు చెప్పారు.1997 వరకు చేప ప్రసాదం పంపిణీ పూర్తిగా దూద్‌బౌలిలోని ఇంటి నుంచే జరిగేదని తెలిపారు. ఆ సమయంలో అన్ని ఖర్చులు, ఏర్పాట్లు కుటుంబ సభ్యులే నిర్వహించేవారని చెప్పారు. అయితే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించిందని వెల్లడించారు.

గత ఏడాది సుమారు నాలుగు లక్షల మంది భక్తులు చేప ప్రసాదం కోసం వచ్చారని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.భక్తులకు ముఖ్యమైన సూచన చేస్తూ, చేప ప్రసాదం కేవలం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమే అందిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి ఆన్‌లైన్ సేవలు లేవని, ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా ప్రసాదం అందిస్తామని చెబితే అది మోసమని గుర్తించాలని హెచ్చరించారు.బత్తిని అనిరుద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము ఏడో తరం ప్రతినిధులుగా చేప ప్రసాదం సేవను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తమ నాయనమ్మ, తండ్రి, బాబాయిలు సహా నలుగురికే ఫార్ములా రహస్యం తెలుసని, సేవాభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉన్నవారికే భవిష్యత్తులో ఈ సంప్రదాయాన్ని అప్పగిస్తామని చెప్పారు.189 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేక ఆధ్యాత్మిక-సాంప్రదాయ సేవగా నిలిచింది.