
రోజంతా ఇంట్లో, ఆఫీసులో పని చేసి అలసి పోతూ ఉంటారు. పని ఒత్తిడి శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయంలో రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పోవాలి అనుకుంటారు. అయితే చాలా మంది నిద్రపోయే ముందు ముఖం, చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రిలాక్సేషన్ వస్తుందని భావిస్తారు.

కానీ నిద్ర పోయే ముందు ప్రతి రోజూ చేయాల్సిన మరొక ట్రిక్ కూడా ఉంది. అదే పాదాలను కడగడం. ఎందుకంటే శరీరం మొత్తం బరువును పాదాలే భరిస్తాయి. వాటిపై ఇంకా ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మీ శరీరం, జుట్టు లాగే మీ పాదాలకు కూడా సంరక్షణ అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజుకు రెండు పూటలా పాదాలను కడుక్కోవాలని నిపుణులు అంటున్నారు. దీని వల్ల పాదాలపై ఒత్తిడి తగ్గుతుందట. అంతే కాకుండా రాత్రి పూట పాదాలను కడగడం వల్ల దుమ్మూ, ధూళి, సూక్ష్మ క్రిములు శరీరం లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి.

కొంత మంది రోజంతా బూట్లు ధరిస్తారు. దీని వల్ల వల్ల పాదాలకు చెమట పట్టి.. బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అందుకే రాత్రి పూట పాదాలు కడిగితే ఈ బ్యాక్టీరియా బెడ్ పైకి చేరకుండా ఉంటుంది. దీంతో వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

అలాగే డయాబెటీస్‌తో బాధ పడేవారు.. ముఖ్యంగా రాత్రి పూట పాదాలను కడిగి నిద్ర పోవాలి. ఎందుకంటే వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల త్వరగా ఇన్ ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.