
ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబం, ఆఫీస్ లేదా వ్యాపారానికి సంబంధించి వివిధ సమస్యల గురించి చింత మనస్సులో తిష్ట వేస్తుంది. ఔనన్నా.. కానన్నా.. వీటితోనే మనం జీవించాలి. రకరకాల ఒత్తిళ్లలో రోజు వారీ పనులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల చాలా మంది మదిలో టెన్షన్ అనే నీలి నీడలు చోటు చేసుకుంటాయి.

కానీ ఈ పరిస్థితులన్నీ కూల్‌గా నిర్వహించాలి. అప్పుడే సమస్యను అధిగమించి జీవితంలో ముందుకు సాగడం సాధ్యమవుతుంది. ఏదైనా కారణం చేత మనలో టెన్షన్ పెరిగినా, భయపడినా గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సిందే. లేదంటే టెన్షన్ వల్ల మైకం కమ్మడం, వాంతులు వంటి సంభవించి అసౌకర్యానికి లోనవుతారు. కొందరికి ఊపిరాడక, కొందరికి విపరీతమైన చెమట, కొందరికి చేతులు, కాళ్లలో హఠాత్తుగా తిమ్మిరి పట్టడం వంటివి వస్తుంటాయి.

నిజానికి భయపడినప్పుడు, మెదడు రక్తంలోకి మరింత ఆడ్రినలిన్ విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ పరిమాణం సరిగ్గా ఉన్నప్పటికీ, అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.

యాంగ్జైటీ, అతిగా ఆత్రుత పడటం, భయపడటంలో తప్పు లేదు. మనమందరం ఏదో ఒక సందర్భంలో ఎక్కువ లేదా తక్కువ లేదా తీవ్ర అనిశ్చితిలో ఇలాంటి పరిస్థితి గుండా వెళ్లే ఉంటాం. అయితే మీరు ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాలి.

అధిక టెన్షన్ పరిష్కారం కాకపోవచ్చు. కానీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. భయంగా అనిపిస్తే వెంటనే ధ్యానం చేయండి. మీ సమస్యను స్నేహితులతో పంచుకోండి. ఇందుకు ప్రాణాయామం లేదా రెగ్యులర్ వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా పదే పదే జరుగుతుంటే మానసిక వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.