
ప్రస్తుత కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీని ప్రభావం చర్మంపై అధికంగా ఉంటుంది. దీనికితోడుగా నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయి. వీటి కారణంగా కళ్ల కింద మచ్చలు, నుదుటిపై ముడతలు, గొంతు చర్మం వయసుకు ముందే కుంచించుకుపోవడం మొదలువుతుంది.

ముఖం మీద డార్క్ స్పాట్స్, ముడతలు, ఫైన్ లైన్స్ మొదలైనవి చర్మం వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. సరైన చర్మ సంరక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి.

30 ఏళ్ల తర్వాత చాలా మంది చర్మంపై వృద్ధాప్య ఛాయలను నివారించడానికి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడుతారు. దీనికి బదులుగా యాంటీ ఏజింగ్ రొటీన్‌ను అనుసరిస్తే.. మీ చర్మంపై వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చు.

అన్ని యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు చర్మానికి మంచివి కావు. వీటికంటే నేచురల్‌గా లభించే కొబ్బరి నూనె చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా మారుస్తుంది.

కొబ్బరి నూనె చర్మపై ఉన్న గాయాలను తగ్గిస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ప్రోటీన్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, కోమలంగా మారుస్తుంది.

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే, కొబ్బరినూనెను ఎలా అప్లై చేయాలో చాలా మందికి తెలియదు.

రాత్రి పడుకునే ముందు అరచేతులపై కొబ్బరి నూనెను రుద్దాలి. ఆ తర్వాత ముఖంపై అప్లై చేయాలి. చర్మం నూనెను పూర్తిగా పీల్చుకునే వరకు కొబ్బరి నూనెను ముఖంపై మసాజ్ చేయాలి. ఆ తరువాత నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని మంచినీటితో కడుక్కోవాలి.