
అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు. ప్రతిదీ అట్టహాసంగా జరుగుతుంది. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవ కార్యక్రమంతో ముందస్తు పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు.

జులైలో అనంత్- రాధిక వివాహం జరగనుండగా.. జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధమైంది. జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ముందస్తు పెళ్లి వేడుకలు, వివాహానికి హాజరయ్యే అతిథులు ఉండేందుకు 5 స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా సకల సౌకర్యాలు ఉంటాయి.

అంబానీ ఇంట పెళ్లి అంటే ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరవుతారు. ఈ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పాటు అనేక మంది ప్రముఖులు రానున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జామ్‌నగర్‌లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో 14 కొత్త ఆలయాలను నిర్మించింది. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి.

ఇక ఈ వేడుకల్లో రాజస్థాన్ కళాకారులకు ప్రత్యేక స్థానం దక్కింది. 1000 మంది ప్రముఖల ఎదుట వారు తమ కళను ప్రదర్శించనున్నారు. మూడు రోజుల పాటు పాటలు, న్యత్య ప్రదర్శనలతో వేదిక హోరెత్తనుంది. రాజస్థాన్ జయపుర బ్లూ పోటరీ ఆకృతులను గరిమా నీలిమ జామనగర్‌లో ప్రదర్శించనున్నారు.