
ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాధ్యమేనని భావిస్తున్నారు. ప్రపంచంలో కొద్దీ దేశాలు మాత్రం ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాలు చేస్తున్నాయి. ఏపిలోని గుంటూరులో కూడా మాగ్నమ్ వింగ్స్ ఎండి అభిరామ్ ఛావా ఎయిర్ ట్యాక్సీ లను రూపొందించి మానవ రహిత ప్రయోగాలను పూర్తి చేశారు. తాజాగా వి2 2.0 ఎయిర్ ట్యాక్సీ సిద్దమైనట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఎయిర్ ట్యాక్సీ పాలసీ తీసుకొచ్చిన వెంటనే ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతాయంటున్నారు.

వి2 2.0 ఎయిర్ ట్యాక్సీలో సింగిల్ ప్యాసింజర్ ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ట్యాక్సీ తయారీలో సేఫ్టికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎనిమిది మోటార్లుంటాయని ఏవైనా రెండు మోటార్లు ఫెయిల్ అయినా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వొచ్చన్నారు. 150 కేజీల బరువుతో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ట్యాక్సీ ముప్పై కిలో మీటర్ల వరకూ వెళ్లి రావచ్చన్నారు.

ఈ వాహనంలో రాడార్, లాడార్, కెమెరాలుంటాయని, జిపిఎస్ అనుసంధానంతో వాహనం ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణ మధ్యలో పక్షులు వంటివి ఎదురైన వెంటనే అలెర్ట్ చేసుందన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రయాణించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించామన్నారు. సింగిల్ ప్యాసింజర్ తో పాటు ముగ్గురు ప్రయాణించే వాహనం డిజైన్ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే మానవ రహిత ప్రయాణ ప్రయోగం చేస్తామన్నారు.

వి2 2.0. వాహనాన్ని నాలుగు రకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ప్యాసింజర్ ట్రావెల్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ ఫైటర్, కార్గో కోసం ఇలా పలు విధాలుగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రపంచంలో ఎయిర్ ట్యాక్సీల ప్రయాణాలు మొదలైన వెంటనే భారత్ లో కూడా అటువంటి ప్రయాణాలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే కేంద్ర పాలసీ ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది చివరికి అన్నీ అనుమతులు వచ్చి ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాద్యమవుతాయన్న ఆశాభావాన్ని అభిరామ్ వ్యక్తం చేశారు.