
ఎసిడిటీ వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యక్తి కడుపు నోప్పి లేదా తలనొప్పి, కడుపులో మంట వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ మాత్రలు వేసుకోవడం మంచిది కాదు.. అలా అని తీసుకోకుండా ఉండలేరు. అయితే, సాధ్యమైనంత మేరకు గ్యాస్ సమస్యను నయం చేయడానికి ఇంటి నివారణ చిట్కాలను పాటిస్తే మంచిది.. మన వంటింట్లో ఉండే.. అనేక రకాల పానీయాలు ఎసిడిటీ, గ్యాస్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాము నీరు: వాము నీటిని తాగడం ద్వారా మీరు ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 1 కప్పు సాధారణ నీటిలో అర చెంచా వాము గింజలను వేసి తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

నిమ్మ - సోడా: ఎసిడిటీ సమస్య వస్తే నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, సోడా కలిపిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

చల్లని పాలు: ఎసిడిటీ సమస్య ఉంటే చల్లని పాలు తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎసిడిటీ సమస్య వస్తే అందులో పంచదార లేదా ఉప్పు లాంటి.. ఎలాంటి పౌడర్ వేయకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇంగువ: యాసిడ్ ప్రభావాలను తగ్గించడానికి ఇంగువ కూడా మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు ఇంగువ నీటిని కూడా తాగవచ్చు. అసిడిటీ సమస్య ఉన్నవారు, కూరను వండేటప్పుడు ఇంగువ జోడించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మజ్జిగ: గ్యాస్ సమస్య వస్తే మజ్జిగ కూడా తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల కడుపులో మంట నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకొని తాగితే మేలు జరుగుతుంది.