Meghan Markle : రాకుమారి మేఘన్‌ మార్కెల్‌ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వూకి రెండే రోజులు, బ్రిటన్‌ రాణి కోటలో కలవరం

|

Mar 06, 2021 | 8:37 PM

Meghan Markle : బ్రిటన్‌ రాణిగారి కోటలో రహస్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మహారాణి ఎలిజిబెత్‌కు, రాకుమారి మేఘన్‌ మార్కెల్‌కు మధ్య విభేదాలు రోడ్డునపడుతున్నాయి..

Meghan Markle : రాకుమారి మేఘన్‌ మార్కెల్‌ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వూకి రెండే రోజులు, బ్రిటన్‌ రాణి కోటలో కలవరం
Follow us on

Meghan Markle : బ్రిటన్‌ రాణిగారి కోటలో రహస్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మహారాణి ఎలిజిబెత్‌కు, రాకుమారి మేఘన్‌ మార్కెల్‌కు మధ్య విభేదాలు రోడ్డునపడుతున్నాయి. బ్రిటన్‌ రాజకుటుంబ పద్ధతులకు, అమెరికన్‌ స్వేచ్ఛాజీవితానికి మధ్య పోరు నడుస్తోంది. ప్యాలెస్‌కు బైబై చెప్పేసిన రాకుమారి మేఘన్‌ మార్కెల్‌పై బ్రిటన్‌ అంతా మండిపడుతోంది. ఈ రాకుమారి ప్యాలెస్‌ సిబ్బందిని వేధించారని ఒక్కో బ్రిటన్‌ పత్రిక కోడై కూస్తోంది. ఇదే సమయంలో అమెరికన్ల నుంచి మేఘన్‌ మార్కెల్‌కు మద్దతు పెరుగుతోంది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఎలిజబెత్‌ రాణి వర్సెస్‌ రాకుమారి మేఘన్‌ మధ్య అగాధం బ్రిటన్‌లో, అమెరికాలో ఇంకోలా కనిపిస్తోంది.

హాయిగా తిరిగే అందాల చిలక.. అందమైన లోకానికి వచ్చింది. కానీ అది పంజరం అని తెలుసుకుంది. ఆ పంజరపు బంధనాలు తెంచుకుని రివ్వున ఎగిరిపోయింది. పోతూపోతూ పంజరంలోని గోరింకను తీసుకెళ్లిపోయింది. ఇలా చిలకా గోరింకలు ఎగిరిపోవడంతో- అందమైన లోకపు మహారాణికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది బ్రిటన్‌ రాణిగారి కోటలో జరుగుతున్న సంఘర్షణ సింపుల్‌గా ఇదే. మహారాణికి, మనవడి భార్య అయిన రాకుమారికి మధ్య అగాధం. రాజకుటుంబానికి, అమెరికన్‌ స్వేచ్ఛా జీవితానికి సాగుతున్న సంఘర్షణ. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఈ కుటుంబం.. తననుతాను నిలుపుకోలేకపోతోంది. ఒక్కటిగా.. జట్టుగా.. కలసికట్టుగా ఉండలేకపోతోంది.

పంజరంలాంటి లైఫ్‌తో విసిగిపోయిన ఎలిజబెత్‌ రాణి మనవరాలు, ప్రిన్స్‌ హ్యరీ భార్య మేఘన్‌ మార్కెల్‌ ఇప్పుడు బ్రిటన్‌ వాసులకు ఓ విలన్‌గా మారారు. ప్యాలెస్‌లో వ్యక్తిగత సిబ్బందిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజకుటుంబానికి గుడ్‌బై చెప్పిన తర్వాత వెలుగులోకి ఈ ఆరోపణలు. మేఘన్‌ తీరుపై 10 మంది మాజీ ఉద్యోగులు నోరువిప్పారట. దీనిపై దర్యాప్తునకు బ్రిటన్‌ రాజకుటుంబం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మేఘన్‌ మార్కెల్‌మీద బ్రిటన్‌ పత్రికలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. మేఘన్‌ వేధింపులపై 10 మంది మాజీ ఉద్యోగులు దర్యాప్తునకు సహకరిస్తున్నారంటూ మిర్రర్‌ అనే పత్రిక ఆర్టికల్‌ రాసేసింది. ధరించాల్సిన దుస్తుల విషయంలో రాజ కుటుంబ ప్రొటోకాల్‌ను మేఘన్‌ ఉల్లంఘించినట్లు, సిబ్బందితో గొడవ పడినట్లు మరో కథనం. ప్రిన్స్‌ హ్యరీకి, మేఘన్‌కు కమ్యూనికేషన్‌ సెక్రటరీగా పనిచేసిన జాసన్‌ అనే వ్యక్తి కూడా 2018 అక్టోబర్‌లో ఫిర్యాదులు చేసినట్లు మిర్రర్‌ చెబుతోంది.

మేఘన్‌ మార్కెల్‌ కఠినమైన బాస్‌. ఆమె తన సిబ్బంది నుంచి చాలా ఆశిస్తారు. ఒక్కొక్కరు ఒకలా చెబుతారు. మొత్తమ్మీద ఒకటి మాత్రం నిజం. ఆమె తన సిబ్బందిని వేధించారు, ఇబ్బంది పెట్టారు. ఈ వివాదంపై అమెరికన్‌ సమాజం, అమెరికన్‌ మీడియా భిన్నంగా స్పందిస్తుంది. రాజకుటుంబ మహిళలు స్వేచ్ఛగా ఉండకూడదని బ్రిటిష్‌ మీడియా, బ్రిటిష్‌ సమాజం భావిస్తోందని విమర్శిస్తున్నారు అమెరికన్లు. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ కాలిఫోర్నియాలో హాయిగా ఉంటారని విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. మొత్తమ్మీద ఇదంతా బ్రిటన్‌ రాజకుటుంట కట్టుబాట్లకు, మిగతా ప్రపంచానికి సాగుతున్న యుద్ధంలా మారింది ఈ వ్యవహారం. బ్రిటిష్‌ సంస్కృతి, అక్కడి సమాజం ఇప్పటికీ సంప్రదాయంగా, మూసపద్ధతిలో ఉంటుంది. రాజకుటుంబంలోని మహిళలు కట్టుబాట్ల మధ్య ఉండాలని బ్రిటిష్‌ పత్రికలు, అక్కడి సమాజం కోరుకుంటోంది.అయితే, అమెరికన్‌ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది. స్వేచ్ఛకు, స్వతంత్రతకు విలువను ఇస్తుంది. ఈ స్వేచ్ఛా స్వతంత్రాలకు ప్రతిరూపం మేఘన్‌.

అమెరికన్‌ సినిమాల్లో, టీవీల్లో నటించిన మేఘన్‌ పాపులర్‌ అయ్యారు.స్టార్‌ కాలేదుగానీ.. మంచి ఈజ్‌ ఉన్న నటిగా పేరుతెచ్చుకున్నారు. ఎదుగుతున్న ఈ హీరోయిన్‌కు.. హ్యారీ దొరికాడు.. కానీ పెళ్లి తర్వాత హ్యాపీ మాత్రం కరువైంది. రాజ కుటుంబంతో విసుగు చెందిన మేఘన్‌.. మళ్లీ మీడియాలోకి వస్తున్నారు. మీడియా బిజినెస్‌లోకి దిగుతున్నారు. బ్రిటిష్‌ రాజ కుటుంబంలోని రాకుమారి మేఘన్‌ మార్కెల్‌- ఇప్పుడు ఆ రాజకుటుంబానికి పెద్ద ఆస్టరాయిడ్‌లా కనిపిస్తున్నారు. ఆ ఆస్టరాయిడ్‌ వల్ల ఏం జరుగుతుందో అని భయపడుతోంది రాజకుటుంబం. ఎందుకంటే ఈ రాకుమారి, తన భర్తతో కలసి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోనే దుమ్మురేపుతోంది. పూర్తి ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ కావడానికి రెండే రోజులుంది. దీంతో ఇప్పుడు ఎలిజబెత్‌ రాణి కాళ్లకింద భూమి కంపిస్తోంది.

Read also : Vijayawada corporation elections : బోండా ఉమ, బుద్దా బ్లాస్ట్..! కేశినేని కూతురు దిద్దిన బెజవాడ రాజకీయం, టీడీపీకి విజయాన్ని అందిస్తుందా?