Prashant Kishor: సోనియా ఆఫర్‌ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యేక వ్యూహంతోనే పీకే నిర్ణయం.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే!

|

Apr 26, 2022 | 5:54 PM

ప్రశాంత్ కిశోర్ తాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా కూడా ట్వీట్ చేశారు. తమ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని సూర్జేవాలా పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ తిరస్కారం వెనుక మరో ప్రత్యేక ప్రత్యామ్నాయ వ్యూహం వున్నట్లు కనిపిస్తోంది.

Prashant Kishor: సోనియా ఆఫర్‌ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యేక వ్యూహంతోనే పీకే నిర్ణయం.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే!
Pk , Kcr , Sonia Gandhi
Follow us on

PRASHANTH KISHORE DECLINED SONIA GANDHI OFFER BECAUSE OF HIS OWN STRATEGY: శతాబ్దానికిపైగా దేశ రాజకీయాలను ప్రభావితం  చేస్తూ వస్తూ గత దశాబ్ద కాలంగా చతికిలా పడిన కురువృద్ధ కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ వ్యూహకర్త తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. సాక్షాత్తు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన సవినయ విఙ్ఞప్తిని తిరస్కరించి పెద్ద షాకే ఇచ్చారు. ఏడాది కాలంగా కొనసాగుతూ.. గత పది రోజులుగా తీవ్రమైన చర్చకు ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిశోర్ తెరదించారు.  కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరడం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలో చేరాలని, 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపుతో కలిసి పని చేయాలని సోనియా కోరినా కనికరించలేదు ప్రశాంత్ కిశోర్. సరికదా..  తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదని పరోక్షంగా చురకంటించారు. కీలకమైన తరుణంలో పార్టీకి ఎవరు సారథ్యం వహించాలన్నది తేల్చుకోవాలని ట్వీట్ చేశారు. పార్టీలో అంతర్గతంగా వున్న సమస్యలను ఫిక్స్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన లోపాన్ని కూడా ప్రశాంత్ కిశోర్ ఎత్తి చూపారు. ఇంకో అడుగు ముందుకేసి.. ప్రతిపక్షానికి నాయకత్వం వహించే వారిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోవాలని కూడా చురకంటించారు. పార్టీలో చేరడం మాట అటుంచి.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వున్న సమస్యలను పరిష్కరించుకుని, సమిష్టి నాయకత్వాన్ని తెచ్చుకోకపోతే వరుస ఓటముల పరంపర కొనసాగుతుందంటూ గత పదేళ్ళ కాలంలో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఓటములు కాంగ్రెస్ పార్టీ సొంతమంటూ మరో చురకంటించారు.  నిజానికి ప్రశాంత్ కిశోర్ ఓ పక్క కాంగ్రెస్ అధినేతలతోను, మరోపక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోను వరుసగా భేటీ అవుతుండడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడంటూ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను పలు రకాలుగా ఊహించుకున్నారు. ఓ దశలో అయితే టీఆర్ఎస్ పార్టీని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించే దిశగా పీకే పావులు కదుపుతున్నాడంటూ కథనాలు కూడా వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీలో చేరినా తన సొంత సంస్థ ఐప్యాక్‌ను కొనసాగిస్తూ వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఆయన టీమ్ పని చేస్తుందన్న కథనాలు కూడా వచ్చాయి.  ప్రశాంత్ కిశోర్ రాకను పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించినట్లుగా కూడా ప్రచారం జరిగింది.  పీకే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలపై చర్చించి, అధినేత్రి సోనియాకు ఓ నివేదిక ఇచ్చేందుకు ఎనమిది మంది సభ్యులు కలిగిన ఓ బృందాన్ని నియమించారు. ఈ బృందం ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరిక అంశాన్ని కూడా పరిశీలించింది. మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ నేతల్లో ఆరుగురు ప్రశాంత్ కిశోర్ చేరికను వ్యతిరేకించినట్లు మీడియాకు లీక్ అయ్యింది. ఇదంతా ఓవైపు కొనసాగుతుండగానే ప్రశాంత్ కిశోర్ తాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా కూడా ట్వీట్ చేశారు. తమ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని సూర్జేవాలా పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ తిరస్కారం వెనుక మరో ప్రత్యేక ప్రత్యామ్నాయ వ్యూహం వున్నట్లు కనిపిస్తోంది.

Prashant Kishore Tweet

గత సంవత్సర కాలంగా ప్రశాంత్ కిశోర్ అటు కాంగ్రెస్ పార్టీతోను, ఇటు టీఆర్ఎస్ పార్టీతోను కలిసి పనిచేస్తున్నట్లు కనిపించారు. 2021 జులై 13న రాహుల్ గాంధీ, ప్రియాంకా వధేరాలతో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. అప్పట్లో ఏం మాట్లాడుకున్నారో ఏమోగానీ.. మళ్ళీ 9 నెలల తర్వాత పీకే కాంగ్రెస్ నాయకులను మళ్ళీ కలిశారు. మొన్న ఏప్రిల్ 17న.. తిరిగి 19న ప్రశాంత్ కిశోర్ సోనియాగాంధీని కలిశారు. తిరిగి ఏప్రిల్ 22వ తేదీన కూడా వాళ్ళిద్దరు సమావేశమయ్యారు. అయితే.. ఏప్రిల్ 19న సోనియాగాంధీని కలిసినపుడు రాహుల్ గాంధీ సమక్షంలోనే పీకే ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఏఏ వ్యూహాలతో బీజేపీని ఓటమి పాలు చేయాలి అన్న దానిపైనే పీకే ప్రజెంటేషన్ ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను గాంధీ (నిజానికి నెహ్రూ) కుటుంబీకులు ఇతర సీనియర్ల కలిసి పంచుకోవాలని కూడా పీకే సూచించారు. UPA ఛైర్ పర్సన్ పాత్రకు సోనియా గాంధీ పరిమితం కావాలని, రాహుల్ గాంధీని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మెన్‌గా నియమించాలని పీకే కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. ప్రియాంకను కోఆర్డినేషన్ వర్క్‌లో వినియోగించాలని, పార్టీ అధ్యక్ష పదవిని ఇతరులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రజెంటేషన్ అంశాలపై అధ్యయనం చేసి.. కీ నోట్స్‌తో నివేదిక ఇవ్వాల్సిందిగా ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని సోనియా గాంధీ నియమించారు. ఇటు 2021 డిసెంబర్ 3వ తేదీన ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మళ్ళీ 2022 ఫిబ్రవరి 27వ తేదీన మరోసారి వీరిద్దరు కలిశారు. మార్చిలో మరోసారి వీరిద్దరి భేటీ జరిగింది. తిరిగి ఏప్రిల్ 23, 24 తేదీల్లో పీకే, కేసీఆర్ పదేసి గంటలపాటు సమావేశమై చర్చలు జరిపారు. ఈక్రమంలోనే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇవి కాస్తా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ వీలినమని, కేటీఆర్‌ని సీఎం చేయడం ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ఏవేవో ఊహాజనిత కథనాలు కూడా వచ్చేశాయి.

వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ కదలికలు చాలా జాగ్రత్తగా వుంటాయి.  గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టేలా వ్యూహాలుంటాయని అంటారు. అందుకే దేశంలో పలువురు పేరున్న, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతలు సైతం ఆయన్ని ఆశ్రయిస్తుంటారని అంటుంటారు. బెంగాల్‌లో మమతా బెనర్జీతోను, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోను, తమిళనాడులో ఎంకే స్టాలిన్‌తోను పీకే పని చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేతోను ఆ రాష్ట్ర ఎన్నికలకు ముందు పలు మార్లు పీకే భేటీ అయ్యారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి వ్యూహకర్తగా పని చేశారు.  ఎన్నికల్లో వారి విజయానికి పీకే సిఫారసులు బహుబాగా ఉపయోగపడ్డాయని అందరూ భావిస్తారు. ఈక్రమంలోనే త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ అంతటి రాజకీయ చతురుడు పీకే సేవలను పొందుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  అయితే పీకేతో తన దోస్తీ ఈనాటిది కాదని గత ఏడేళ్ళుగా ఆయన సేవలు పొందుతున్నామని కేసీఆర్ స్వయంగా వెల్లడించడం విశేషం.  ఇదిలా వుండగానే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. 2024 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే తనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపుకు తానే సారథ్యం వహిస్తానని.. ఇలా పలు షరతులను ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. ఈ షరతుల పట్ల పార్టీలో వ్యతిరేకత రావడం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలెవరు సుముఖంగా లేకపోవడంతో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపులో కేవలం సభ్యునిగా కొనసాగాల్సిందిగా కాంగ్రెస్ నేతలు పీకేను కోరినట్లు సమాచారం. అసలే వరుస ఓటములతో కునారిల్లిపోయిన పార్టీకి జవసత్వాలు తేవడం కష్టసాధ్యమని భావించిన పీకే పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా ఆ పార్టీలో చేరి సాధించేదేమీ లేదని భావించడం వల్లనే సోనియా విఙ్ఞప్తిని తిరస్కరించారని తెలుస్తోంది. పార్టీలో చేరబోనని చెబుతూనే ఆయన పార్టీలోని లోపాలను ఎత్తి చూపారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే ఆ పార్టీలోని అంతర్గత సమస్యలను, లోపాలను పరిష్కరించుకోవడం ఇంపార్టెంట్ అని పీకే తన ఫస్ట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రెండో ట్వీట్‌లో ఇన్‌డైరెక్టుగా ప్రధాని నరేంద్ర మోదీని ‘‘సాహెబ్’’ అంటూ సంభోదించిన పీకే.. మూడో ట్వీట్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. విపక్ష నేతను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీలో అది లేదని పరోక్షంగా ఎత్తిచూపారు. గత పదేళ్ళలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఓటములనే చవి చూసిందని పేర్కొన్నారు.

నిజానికి ప్రశాంత్ కిశోర్ తమ పార్టీలో చేరాలని కోరుకున్న కాంగ్రెస్ నేతల కంటే చేరొద్దని కోరుకున్న వారే అధికంగా వున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ అయితే ఏకంగా పార్టీ కీలక నేతలకు ఫోన్లు చేస్తూ అధిష్టానానికి పీకేను చేర్చుకోవద్దంటూ విఙ్ఞప్తులు పంపాలని కోరారు. అటు జీ23 నేతల్లో హెచ్చుశాతం పీకే రాకను వ్యతిరేకించారు. పీకే పీపీటీ మీద అధ్యయనానికి నియమించిన ఎనిమిది మంది సభ్యుల కమిటీలో ఆరుగులు పీకే రాకను వ్యతిరేకించారు. తెలంగాణ నేతలైతే టీఆర్ఎస్ పార్టీలో కలిసి పని చేస్తున్న పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేరితే కోవర్టు అవుతాడని భయాందోళన వ్యక్తం చేశారు. అయితే..  కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ప్రకటించిన పీకే ఇక టీఆర్ఎస్ అధినేత ప్రవచిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కూర్పు కోసం పని చేస్తారని తెలుస్తోంది. గతంలో తాను వ్యూహకర్తగా వ్యవహరించిన పార్టీలను ఒక్కతాటిపైకి తేవడం ద్వారా తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయనున్నట్లు కనిపిస్తోంది. ఈ మూడో ఫ్రంట్ చెప్పుకోదగిన సీట్లను సాధిస్తే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకారంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించవచ్చని, అందుకు తన వ్యూహకర్తగా పని చేసిన పార్టీలతో సయోధ్య తనకు సులభసాధ్యమని పీకే భావిస్తున్నారనిపిస్తోంది. అలాంటి ప్రభుత్వం ఏర్పాటైతే తానే అన్ని పార్టీల సమన్వయ కర్తగా కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్నది పీకే వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.