Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ హైప్.. రాజకీయ పార్టీలొకవైపు.. ఆశావహులొకవైపు.. జోరుగా సర్వేలు.. గ్రౌండ్ రిపోర్టులు

|

Dec 15, 2022 | 2:17 PM

పార్టీల హంగామా ఎలా వున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారి ప్రయత్నాలు కూడా ఇటీవలి కాలంలో ముమ్మరమయ్యాయి. సిట్టింగులు, మాజీలతోపాటు కొత్తగా పోటీకి దిగాలనుకుంటున్న వారు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా మారుతున్నారు.

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ హైప్.. రాజకీయ పార్టీలొకవైపు.. ఆశావహులొకవైపు.. జోరుగా సర్వేలు.. గ్రౌండ్ రిపోర్టులు
Follow us on

తెలంగాణలో రాజకీయ పార్టీల హడావిడి పెరిగిపోయింది. ఈ విషయం కాసింత రాజకీయ పరిఙ్ఞానం వున్నవారెవరికైనా తెలిసిపోతూనే వుంది. పార్టీల హంగామా, అధినేతల వరుస కార్యక్రమాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణం వచ్చినా తాము రెడీగా వున్నామన్న సంకేతాలిస్తూనే పార్టీ యంత్రాంగాన్ని అందుకు అనుగుణంగా వుంచుతున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది.  ఈ విషయంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్), బీజేపీలు కాస్త ఎక్కువగానే హడావిడి చేస్తుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ఎన్నికలను దృష్టిలో వుంచుకుని పార్టీలో వున్న సబ్బండ వర్ణాల వారిని సంతృప్తి పరిచేలా జంబో కార్యవర్గాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూపొందించారు. అధిష్టానం ఆమోదంతో దాన్ని ప్రకటించారు కూడా. ఇంతవరకు బాగానే వున్నా కమిటీల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి భగ్గుమనడంతో ఈ ప్రయోగం కాస్త వికటించిన సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి. అయితేనేం ఈ సంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి సక్సెస్సయినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే కమిటీల కూర్పు మీద లోలోపల అసంతృప్తి రగులుతున్నా బహిరంగంగా కామెంట్ చేసింది ఒకరిద్దరు నేతలే. కొండా సురేఖ వంటి వారిని బుజ్జగించడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతం అయినట్లే భావించాలి ప్రస్తుతానికి.

ముందస్తుకు అవకాశం తక్కువ

ఇదిలా వుంటే పార్టీల హంగామా ఎలా వున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారి ప్రయత్నాలు కూడా ఇటీవలి కాలంలో ముమ్మరమయ్యాయి. సిట్టింగులు, మాజీలతోపాటు కొత్తగా పోటీకి దిగాలనుకుంటున్న వారు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా మారుతున్నారు. షెడ్యూలు ప్రకారం జరిగితే ఇంకో పది మాసాల్లో ఎన్నికలు జరగాలి. ముందస్తుగా జరగాలంటే కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ తలపెడితే మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలల కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చు. లేక కేంద్రం గనక రాజకీయం చేయాలనుకుంటే రాష్ట్రపతిపాలన లేదా ఇతరేతర మార్గాల ద్వారా ఎన్నికలను జాప్యం చేయించవచ్చు. ముందస్తు ఎన్నికలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడలు ‘ఎత్తుకు పైఎత్తు’ అన్న చందంగా వున్నాయి. ముందస్తుపై ఏదీ ఇదమిత్తంగా చెప్పలేని పరిస్థితి. ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. పార్టీల అధినేతలు జనంలో వుండేందుకు, తమ వాణీని వినిపించేందుకు ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్రలతో జనం మధ్యకు వెళుతుండగా.. కలెక్టరేట్ల ప్రారంభోత్సవం వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభాల పేరిట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తమతమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారు. ఇది పార్టీలు, వాటి అధినేతల స్టైల్ అయితే.. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తొలిసారి పోటీ చేద్దామనుకుంటున్నా ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కొందరు కొన్ని సర్వే సంస్థలను ఆశ్రయిస్తుండగా.. ఇంకొందరు గ్రౌండ్ రిపోర్టు తెలుసుకునేందుకు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాటలు వేసుకుంటున్నారు. ఆల్ రెడీ రాజకీయాల్లో వున్న వారు తమ పునాదులను బలోపేతం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

చివరి క్షణంలో ఝలక్ ఇస్తారా?

తెలంగాణ అసెంబ్లీకి నిర్ణీత షెడ్యూలు కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే కథనాలతో రాష్ట్రంలోని విపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు… గతంలో వుండి ఆ తర్వాత మాజీలైనవారు, కొత్తగా శాసనసభలోకి ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్తు గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వ్యక్తిగత సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్‌గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, సానుకూల, ప్రతికూల అంశాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నతేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ చాలా రోజుల క్రితమే చెప్పేశారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు… టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తూ నిరాశకు గురవుతున్న వారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. పర్సనల్‌గా కొందరిని లేదా ఏదైనా సంస్థను నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

నాడు-నేడు కేసీఆర్ భిన్నవ్యూహం

2018లో ముందస్తుకు వెళ్ళే ముందు కేసీఆర్ చేసిన ప్రకటన, మొన్నామధ్య సిట్టింగులందరికీ మళ్ళీ టిక్కెట్లిస్తామన్న ప్రకటన పరస్పరం భిన్నంగా వున్నాయి. గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికి పంపిస్తానని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేకుండా సిట్టింగులందరికీ మళ్ళీ టిక్కెట్లిస్తానని చెప్పేశారు. అది కూడా ఎన్నికలకు ఆల్మోస్ట్ ఏడాది ముందు. అంటే సిట్టింగులెవరికైనా నియోజకవర్గంలో అనుకూలత లేకపోతే దాన్ని సవరించుకునేందుకు వారికి ఏడాది సమయం ఇచ్చారు కేసీఆర్. అందుకే పార్టీతో సంబంధం లేకుండా తమ పరిస్థితి ఎలా వుందో తెలుసుకునేందుకు సిట్టింగులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రాజకీయ చాణక్యునిగా పేరున్న కేసీఆర్ మాటలకు అర్థాలు వేరుగా వుంటాయని కొందరు సిట్టింగులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర అందరి జాతకాలు ఇప్పటికే వున్నందున, ఎవరికైనా జనామోదం లేదని భావిస్తే ఆఖరు నిమిషంలో వారికి టిక్కెట్ కట్ చేస్తారని పలువురు సిట్టింగులు భావిస్తున్నారు. అందుకే సొంతంగా సర్వేలు చేయించుకుంటూ తమ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

చోటామోటా నేతలూ సర్వేల బాటే

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్‌మెంట్‌ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నేతలంగా గమనించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు. టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌గా నియమించింది. కొన్ని చోట్ల ఎంపీటీసీ స్థానానికో ఎమ్మెల్యే పని చేశారు. ఇందుకు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు కూడా మినహాయింపు కాకపోవడం గమనార్హం. ఆఖరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ గ్రామానికి ఇంఛార్జీగా వ్యవహరించారు. కానీ ఆయన గ్రౌండ్‌లోకి దిగకుండా హైదరాబాద్, ఎర్రవెళ్ళిల నుంచి పర్యవేక్షించారు. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు తేలితే దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమకున్న గ్రాఫ్‌ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ఆపరేషన్ ఆకర్షను మూడు ప్రధాన పార్టీలు రాష్ట్రస్థాయిలో కొనసాగిస్తుండగా.. గ్రౌండ్ లెవెల్లో వివిధ పార్టీలకు చెందిన చోటామోటా నాయకులకు గాలమేసే పనిలో ఎమ్మెల్యేలు బిజీ అవుతున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు చాలా ముందుగానే రాజకీయ జాతర ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.