Corona in India: కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్ళీ దేశంలోనే అనేక రాష్ట్రాల్లో కోవిడ్ (Covid 19) కొత్త కేసులు నమోదవుతూ ఆందోళలన రేకెత్తిస్తున్నాయి. ముంబై (Mumbai), ఘజియాబాద్, ఢిల్లీ (Delhi) తదితర ప్రాంతాల్లో కరోనా మహమ్మారిమళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరాదిన మళ్లీ వేగంగా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులే టార్గెట్‌గా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దీంతో పలు చోట్ల మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఢిల్లీలో ఒక్కరోజులోనే 50 శాతం కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోకరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏ ఒక్కరికీ కరోనా సోకినా పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది మాస్కులు, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో గురువారం 325 మందికి కరోనా సోకింది. సోమవారం నాటి కేసులతో పోలిస్తే 237% పెరుగుదల కనిపించింది. ఒక్క వారంలో పాజిటివిటీ రేటు 0.5% నుంచి 2.39%కి పెరిగడం ఆందోళన కలిగిస్తోంది.
వసంత్‌కుంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 మంది పిల్లలు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా స్కూల్ లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 23 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ ను మూసివేశారు. ఘజియాబాద్‌లోని స్కూల్ లో కూడా ఇద్దరు విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ కు 3 రోజుల సెలవులు ప్రకటించారు.భారత్‌లో కొత్త వేరియంట్ ఎంట్రీ కలకలం రేపుతోంది.
కరోనా ముప్పు తగ్గలేదు..జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరోవైపు కరోనా ముప్పు తగ్గలేదని.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని WHO పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ అయ్యిందన్న విషయం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సైతం కోవిడ్ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని, జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యే హెచ్చరించారు.
అంతుకు ముందు రోజు ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన మళ్లీ ఉలిక్కి పడేలా చేసింది. నోయిడాతో పాటు, గజియాబాద్‌లోని పాఠశాలల్లో పలువురు విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు వెంటనే మూడు పాఠశాలను మూసివేశారు. గజియాబాద్‌లోని రెండు ప్రైవేటు స్కూల్స్‌తో పాటు, నోయిడాలోని మరో పాఠశాలలో మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయి.
అయితే వీరికి సోకిన వైరస్ ఎక్స్‌ఈ వేరియంట్ అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. వీలైనంత ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. నోయిడా పాఠశాల మళ్లీ ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించింది. పాఠశాలల్లో పూర్తిగా శాటిటైజేషన్ చేసిన తర్వాత పరిస్థితుల అనుగుణంగా ఏప్రిల్ 18 నుంచి తిరిగి పాఠశాలలను ప్రారంభించనున్నారు.
దేశంలో మళ్లీ కేసులు పెరిగితే ఫోర్త్ వేవ్ ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న కరోనా కాటు వేయడం కాయమంటున్నారు.