తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రభుత్వాధినేతలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేస్తున్న సంకేతాలొకవైపు, పాదయాత్రలతో ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న పరిస్థితి ఇంకోవైపు ఇలా అసెంబ్లీ ఎన్నికలింకా పది నెలల దూరంలో వుండగానే తెలంగాణ పాలిటిక్స్ సూపర్ ఇంటరెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. భైంసా నుంచి అయిదో విడత పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బయలుదేరగానే ఆయన్ని జగిత్యాల జిల్లాలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించడం పాలిటికల్ కాక పెంచింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బండి సంజయ్ పాదయాత్ర భైంసాలో ప్రారంభమైంది. అదేసమయంలో అందరి దృష్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు, దివంగత వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిలపై పడింది. ఆమె గత ఆరేడు నెలలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నా తాజాగా పదునైన ప్రసంగాలతో ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆమె పాదయాత్రను అడ్డుకునేందుకు గులాబీ శ్రేణులు యత్నించడం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిలను నవంబర్ 28న మహబూబాబాద్‌కు వెళ్ళకుండా టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకున్నాయి. ఇది కాస్తా ఘర్షణ దిశగా పయనించడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి తరలించారు. అయితే, పాదయాత్ర కొనసాగించేందుకు షర్మిల నవంబర్ 29న మరోసారి బయలుదేరారు. ఈక్రమంలో హైదరాబాద్ సోమాజిగూడలోనే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల పట్టుబట్టడంతో ఆమెను వాహనంలోనే వుంచి, దాన్ని పోలీసు వాహనానికి ట్యాగ్ చేసి ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పొలిటికల్ మైలేజీ కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఈ హైడ్రామా పోలిటికల్‌గా హైలైట్ అయ్యే అవకాశం కల్పించిందనే చెప్పాలి.
అన్నతో విభేదాల కారణంగా ఆంధ్రా పాలిటిక్స్‌ను వదిలేసి తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. పాలేరులో సానుకూల వాతావరణాన్ని కల్పించుకునేలా ఆమె ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న హైడ్రామా ఆమెకు లాభించవచ్చనే అభిప్రాయాలకు తావిచ్చింది. ఇదిలా వుంటే పాలేరు నియోజకవర్గం ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు ఒక కారణం వైఎస్ షర్మిల అయితే.. రెండో కారణం తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన కామెంట్లు. నవంబర్ 28న పాలేరుకు వెళ్ళి ఓ సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ‘‘ నాపై నమ్మకంతో గెలిపిస్తామన్న భరోసా ఇస్తున్న పాలేరు ప్రజలు కోరుకుంటున్న విధంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాను’’ అని తుమ్మల ప్రకటించారు. ఇలా ప్రకటించడం వెనుక తుమ్మల వ్యూహం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో తనను ఓడించి, ఆ తర్వాత నాలుగైదు నెలలకే తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి తుమ్మల పరోక్షంగా హెచ్చరిక పంపినట్లయ్యింది. అదేసమయంలో పాలేరు సీటు నుంచి తనకే సీటు ఇవ్వాలన్న పరోక్ష సంకేతాన్ని టీఆర్ఎస్ (త్వరలో బీఆర్ఎస్) పార్టీ అధినేత కేసీఆర్‌కు తుమ్మల పంపినట్లయింది. నవంబర్ 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం పాలేరు వెళ్ళిన తుమ్మల నాగేశ్వర్ రావు.. స్వర్గీయ ఎన్టీఆర్ మార్గదర్శకత్వంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నారు. 1982 నుంచి 2014 దాకా గెలుపోటములతో ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగానని చెప్పుకున్నారు. అదేసమయంలో స్థానికులిస్తున్న భరోసాతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
నిజానికి తుమ్మల నాగేశ్వర్ రావు చాలా కాలం పాటు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. వ్యూహకర్తగా పేరుగాంచారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వర్ రావు తాను పోటీ చేసిన తొలి ఎన్నిక (1983)లో ఓటమి పాలయ్యారు. 1985, 1994, 1999లలో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందారు. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2004 దాకా మంత్రిపదవిలో వున్నారు. ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌పై తనదైన ముద్ర వేశారు. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగడంతో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీ వర్గాలకు రిజర్వు అయ్యింది. రాజకీయంగా దశాబ్దాల పాటు దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం సత్తుపల్లి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. జలగం వెంగళరావు తర్వాత ఆయన కుటుంబీకులు చిరకాలం పాటు ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కంచుకోటగా వున్న సత్తుపల్లిలో తుమ్మల శకం 1985లో ప్రారంభమైంది. 1985, 1994, 1999లలో తుమ్మల నాగేశ్వర్ రావు సత్తుపల్లి నుంచి విజయం సాధించారు. 1989లో జలగం వెంగళరావు తనయుడు ప్రసాద రావు, 2004లో వెంగళరావు మరో తనయుడు వెంకట్ రావు సత్తుపల్లిలో తుమ్మలపై విజయం సాధించారు. అయితే 2009లో సత్తుపల్లి ఎస్సీలకు రిజర్వు కావడంతో తుమ్మల మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. అందులోభాగంగా ఆయన 2009లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో తనను సత్తుపల్లిలో ఓడించిన జలగం వెంకట రావును తుమ్మల 2009లో ఖమ్మంలో ఓడించారు. 2014 వచ్చేసరికి రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటవుతున్న తరుణంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్ రావు మరోసారి ఖమ్మం నుంచే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ మనుగడ కష్టసాధ్యమని భావించిన తుమ్మల 2014లోనే కేసీఆర్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఏకంగా మంత్రిపదవిని అధిష్టించారు. మంత్రి పదవిలో కొనసాగేందుకు ఉభయ సభలలో ఏదైనా ఒకదాంట్లో సభ్యత్వం అనివార్యమైన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర రావును ఎమ్మెల్సీ చేశారు కేసీఆర్. అయితే, పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నిక బరిలోకి తుమ్మలను దింపారు కేసీఆర్. రాంరెడ్డి సతీమణి సుచరిత రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగగా.. తుమ్మల నాగేశ్వర్ రావు విజయం సాధించారు.
2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన దరిమిలా తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు నుంచే మరోసారి బరిలోకి దిగారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2018లో ఓటమి తర్వాత తుమ్మల టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా లేరనే చెప్పాలి. ఈక్రమంలో ఇటీవల ఆయనను తమ పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ దశలో ఆయన బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా జరిగినా ఆయన పార్టీ మారలేదు. తాజాగా నవంబర్ 28న ఆయన పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటన చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ పార్టీలోనే వున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇపుడు తుమ్మలకు స్ట్రాంగ్ అప్పోనెంట్. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి టిక్కెట్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈనేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే టీఆర్ఎస్ టిక్కెట్ లభిస్తే.. తుమ్మల ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా ? లేక ఇంకేదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా అన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం, తన రాజకీయ గురువు ఆయనే అనడం చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునరుద్దరించే బాధ్యతను తుమ్మల చేపడతారా అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో చిరకాలంగా ఆయన కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తుమ్మల అటువైపు మొగ్గుచూపుతారా అన్నది కూడా చర్చకు దారితీస్తోంది. ఏది ఏమైనా తన సామాజిక వర్గం బలంగా వున్న పాలేరులోనే తుమ్మల రాజకీయ భవిష్యత్తును తేల్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక 2021 తొలినాళ్ళలో తెలంగాణలో పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కూడా తాను తెలంగాణ బిడ్డనే అంటూ పాలేరు బరిలోకి దిగబోతున్నారు. ఖమ్మం తన అత్తగారిల్లని చెప్పుకుంటున్న షర్మిల .. తెలంగాణవాదం అంతగా లేని పాలేరును వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా వుండడమే షర్మిల నిర్ణయానికి కారణమని కొందరు బావిస్తున్నారు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం వుండగానే పాలేరు నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..