Uber : అంధురాలిని గమ్యం చేర్చేందుకు నిరాకరించినందుకు గానూ ప్రముఖ క్యాబ్ సంస్థ ఊబర్ కు అమెరికాలో భారీ జరిమానా విధించారు.
ఉబర్ పేరు తెలీని ఉండరు. తక్కువ ఖర్చుతో ప్రయాణానానికి క్యాబ్ లను సమకూర్చే ఆన్లైన్ సంస్థ ఇది. ఇప్పుడు ఈ సంస్థకు చిక్కు వచ్చిపడింది. అమెరికాలో ఓ అంధురాల్ని 14 సార్లు తమ క్యాబ్ ఎక్కించుకోవడానికి ఊబర్ క్యాబ్ డ్రైవర్లు నిరాకరించారు. దాంతో ఊబర్ సంస్థ చిక్కుల్లో పడింది. ఈ తప్పుకుగానూ ఊబర్ సంస్థకు 1.1 మిలియన్ డాలర్లు ( అంటే సుమారు 8 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించారు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో బే ప్రాంతానికి చెందిన లిసా ఇర్వింగ్ ఒక అంధురాలు. ఆమె తన పెంపుడు కుక్క సహాయంతో తిరుగుతుంది. అమెరికాలో అంధులకు దారి చూపించే విధంగా ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలు ఉంటాయి. వీటిని సీయింగ్ ఐ డాగ్ అని పిలుస్తారు. లిసా ఇర్వింగ్ తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయానికి రాత్రి బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో ఆమె గమ్యం చేరుకోవడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, ఆమెతో పాటు సీయింగ్ డాగ్ ఉండడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఆ సమయంలో ఆమెను క్యాబ్ ఎక్కించుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మరో రెండుసార్లు ఆమెను కించపరిచేలా మాట్లాడారు ఊబర్ క్యాబ్ డ్రైవర్లు.
ఇదే విషయంపై ఇర్వింగ్ తన లాయర్ల సహాయంతో ఊబర్ కు ఫిర్యాదు చేసింది. కానీ, ఊబర్ మాత్రం దీంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించింది. తమ క్యాబ్ డ్రైవర్లు ప్రయివేట్ కాంట్రాక్టర్లు అని, వారు ఆమెను క్యాబ్ లోకి ఎక్కించుకోవడానికి నిరాకరించడం తమకు సంబంధించిన విషయం కాదనీ చెప్పింది.
అయితే, ఈ కేసు చూసిన ఆర్బిటర్ మాత్రం తప్పు ఊబర్ దే అని నిర్ధారించారు. అమెరికా చట్టాల ప్రకారం అంధులకు దారి చూపించే కుక్కలను వారికి తోడుగా ఉండేందుకు ఎక్కడికైనా వెళ్లొచ్చు. మరి క్యాబ్ లోకి ఎక్కించుకోకపోవడం కచ్చితంగా వారి పట్ల వివక్ష చూపించడమే అని అన్నారు. రైడ్ షేర్ రివల్యూషన్ లో ఎక్కువగా అంధులకు ప్రయోజనం చేకూరాల్సి ఉండగా.. ఊబర్ సంస్థ మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తోంది అంటూ ఇర్వింగ్ కేసును వాదించిన లాయర్ కాబాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదేవిషయంపై మాట్లాడిన ఊబర్ ప్రతినిధి ఆండ్రూ హస్బన్ ”ఊబర్ సంస్థ వాడే టెక్నాలజీ అంధులకు ఉపయోగపడేవిధంగా ఉంటుంది. ఊబర్ యాప్ ను అంధులు కూడా సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించామని చెప్పడానికి గర్విస్తున్నాము. అయితే, కొందరు డ్రైవర్లు చేసే ఇటువంటి పనుల వాళ్ళ సంస్థ చిక్కుల్లో పడుతోంది.” అని చెప్పారు.