దేశీయంగా చిన్నారుల కోసం తయారు చేసిన ‘జైకోవ్-డీ’ టీకా ధరను జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ప్రకటించింది. 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు మూడు డోసులుగా ఇవ్వాల్సిన ఈ వ్యాక్సిన్ ధరను రూ. 1900గా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే ధర తగ్గింపు విషయంలో జైడస్ క్యాడిలా సంస్థతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
దీనితో ఈ వారంలోగా వ్యాక్సిన్ ధరపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 0, 28, 56 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలని జైడస్ క్యాడిలా సంస్థ పేర్కొంది. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన మొట్టమొదటి టీకా ‘జైకోవ్-డీ’. ఈ టీకాను జెట్ ఇంజెక్టర్‌తో ఇవ్వాల్సి ఉంటుందట.
మరోవైపు చిన్నారులకు ఇవ్వాల్సిన టీకా విషయంలో కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 12-18 ఏళ్ల చిన్నారులకే తొలి ప్రాధాన్యమని.. ఆ తర్వాత సాధారణ పిల్లలకు వ్యాక్సిన్ అందజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. జాతీయ నిపుణుల బృందం ఇచ్చే సలహాల కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.