అంతర్జాతీయంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన చర్యలకు కొవిడ్ -19 తీవ్ర ప్రతిబంధకంగా మారిందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ దిశగా చేపట్టిన చర్యలను ఉక్రెయిన్ యుద్ధం పూర్తి రివర్స్ చేసిందని తెలిపింది. ఈ కారణాలతో పాటు పెరుగుతున్న ఆహార ఇంధన ధరలు, చైనాలో ప్రగతి మందగించడం వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదరికం నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 9.3 శాతం మంది అంటే 72 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని వల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ దేశాల్లో ఎక్కువ వరకు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. చాలా మంది రోజుకు 2.15 డాలర్లతో జీవితాన్ని నెట్టుకొన్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.
ఇండియా చేపట్టిన డిజిటల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్స్‌తో పేదలకు చాలా ప్రయోజనం కలిగిందని వల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రశంసించింది. డిజిటల్ మార్పుల కారణంగా ప్రజాధనం ఖర్చులో పారదర్శకతతో పాటు పరిపాలనపరమైన ఖర్చులు కూడా తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఇప్పుటికి భారతదేశంలో సుమారు 60 కోట్ల మంది రోజుకు 3.65 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అదే చైనాలో 35 కోట్ల మంది పేదలున్నారని, కాని వారి రోజువారీ సంపాదన 6.85 డాలర్లు అని ప్రపంచ బ్యాంక్ లెక్కలు గట్టింది. 2020లో 5.6 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికంలో కూరుకుపోయారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
అత్యధిక జనాభాతో కూడిన దేశాలైన చైనా, ఇండియానే కాదు నైజీరీయా, కాంగోలోని ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావం అదే స్థాయిలో ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇండియాలో కొవిడ్ సమయంలో ఏర్పడిన సంక్షోభం నుంచి ఆదాయ నష్టాలు పూరించడంలో పనికి ఉపాధి పథకం ఎంతో తోడ్పడిందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఒక జిల్లాను రైల్వే నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడం ద్వారా వ్యవసాయ ఆదాయంలో 16 శాతం పెరుగుదల చోటుచేసుకుందని ఈ నివేదిక అంచనా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..