ఈ మధ్యకాలంలో అందరూ ఆన్‌లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే అప్పుడప్పుడూ ఈ ఆన్‌లైన్ షాపింగ్ మనల్ని షాక్‌కు గురి చేస్తుంటుంది. కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. అవి ఇంటికి డెలివరీ కాకపోవడం.. లేదా వాటి స్థానంలో మరొకటి పార్శిల్‌లో ఉండటం లాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇదే నిదర్శనంగా బెంగళూరు ఓ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక రాజాజీనగర్‌కు చెందిన దివ్యశ్రీ అనే మహిళ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12 వేల 500 విలువ చేసే ఓ మొబైల్‌ను 2022, జనవరి 15వ తేదీన ఆర్డర్ పెట్టింది. కానీ ఆమెకు ఇప్పటివరకు ఫోన్ మాత్రం డెలివరీ కాలేదు. సదరు మొబైల్ నిమిత్తం పలుమార్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను ఆమె సంప్రదించినా.. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దివ్యశ్రీ చివరికి.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌పై వినియోగదారుల కోర్టుకెక్కింది. ఈ మేరకు బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్.. ఇటీవల తుది తీర్పు ఇచ్చింది. రూ. 12,499(మొబైల్ ఖరీదు)తో పాటు వార్షిక వడ్డీ 12 శాతం + రూ. 20,000 జరిమానా + రూ. 10,000 లీగల్ ఖర్చులు ఫ్లిప్‌కార్ట్ చెల్లించాలని కమిషన్ ఛైర్‌పర్సన్ ఎం. శోభ, సభ్యురాలు రేణుకాదేవి దేశపాండే తీర్పునిచ్చారు.
ఈ అంశంలో ఫ్లిప్‌కార్ట్ సర్వీస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాదు.. అనైతిక పద్ధతులను కూడా అనుసరించిందని బెంగళూరు వినియోగదారుల న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. టైమ్‌లైన్ ప్రకారం ఫోన్ డెలివరీ చేయకపోవడంతో కస్టమర్ ఆర్ధికంగా నష్టపోవడమే కాదు.. మానసికంగా కృంగిపోయారని తెలిపింది. కస్టమర్ తనకు ఫోన్ డెలివరీ కాకపోయినా కూడా వాయిదాలు చెల్లిస్తున్నారని స్పష్టం చేసింది. అంతేకాదు సదరు కస్టమర్.. ఫ్లిప్‌కార్ట్ సర్వీస్ కేర్‌ను ఎన్నిసార్లు సంప్రదించినా.. ఆమెకు ఎలాంటి సాయం అందలేదని ఉత్తర్వుల్లో హైలైట్ చేసింది.
కాగా, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్లకు ఇలాంటివి జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడం బెటర్.(Source)