AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. మమతా బెనర్జీ లేకుండానే కొత్త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ..!

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు సరికొత్త రాజకీయ తుఫాన్ ముంచుకొస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. మమతా బెనర్జీ సామ్రాజ్యానికి మహారాష్ట్ర మోడల్ ముప్పు పొంచి ఉందా? అసలు దీదీ పార్టీలో ఏం జరుగుతోంది? నిలువునా చీలిపోయే దిశగా తృణమూల్ అడుగులు పడుతున్నాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mamata Banerjee: దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. మమతా బెనర్జీ లేకుండానే కొత్త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ..!
Will The Maharashtra Model Repeat In West Bengal
Krishna S
|

Updated on: Jun 02, 2026 | 8:18 AM

Share

పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, యువ నేత అభిషేక్ బెనర్జీ లేని కొత్త తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు కాబోతోందా? అనే ఊహాగానాలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాతి సమీకరణలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బద్దలవడంతో పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిపోయిన తరహాలోనే.. ఇప్పుడు బెంగాల్‌లోనూ మహారాష్ట్ర మోడల్ పునరావృతం కాబోతోందా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

తిరుగుబాటుకు కారణమైన సంతకాల వివాదం

ఈ వివాదానికి ప్రధాన కారణం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిన సిగ్నేచర్ రో. ఈ వ్యవహారంలో పార్టీ అంతర్గత విషయాలను బయటపెట్టి, విజిల్‌బ్లోయర్‌లుగా మారిన ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ బహిష్కరణ చర్యతో అసమ్మతి శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. పార్టీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు, వారు ఇప్పటికే ప్రత్యామ్నాయ శ్రేణులతో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

దీదీ భేటీకి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా

శనివారం కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన కీలక సమావేశమే ఈ చీలిక ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరవడం తృణమూల్ కాంగ్రెస్‌లో కలకలం రేపింది. మరోవైపు సమావేశానికి రాని కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నేత రథిన్ ఘోష్ నివాసంలో భేటీ అయినట్లు సమాచారం. అయితే తాను అనారోగ్యం కారణంగానే దీదీ సమావేశానికి వెళ్లలేదని రథిన్ ఘోష్ సమర్థించుకున్నారు. అదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు దక్షిణ కోల్‌కతాలోని గేట్‌వే హోటల్‌లో రహస్యంగా సమావేశమవడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ఇది బీజేపీ కుట్ర: మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం

ఈ పరిణామాలపై బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందిస్తూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీలోని ఒక వర్గంతో కలిసి బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆమె ఆరోపించారు. ‘‘నలుగురు ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని తీవ్రంగా భయపెడుతున్నారట. ఒకవేళ కాళీఘాట్ సమావేశానికి హాజరైతే.. ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేస్తామని బెదిరించారట. అసలు ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? రాష్ట్రంలో అణచివేత అన్ని హద్దులు దాటిపోయింది. మా ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రలోభాలతో, బెదిరింపులతో లాక్కోవాలని బీజేపీ చూస్తోంది’’ అని ఆరోపించారు. తమ పార్టీలోనే ఉంటూ కొంతమంది నాయకులు ‘ద్రోహులుగా’ మారుతున్నారని, పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కనీస నైతికత లేదా?: కల్నల్ ఘోష్ ఘాటు వ్యాఖ్యలు

హోటల్‌లో రహస్యంగా సమావేశమైన ఎమ్మెల్యేల తీరుపై తృణమూల్ నేత కునాల్ ఘోష్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరి పేర్లనూ నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు ఫోన్ కాల్స్ అందుకుంటూ, గేట్‌వే హోటల్‌లో సమావేశాలు పెడుతున్న ఎమ్మెల్యేలందరికీ ఒక్కటే గుర్తు చేస్తున్నా. మనలో ఎవరూ స్వతంత్ర అభ్యర్థులుగా గెలవలేదు. ఒక 70 ఏళ్ల మహిళ రాష్ట్రమంతటా అలుపెరగకుండా తిరుగుతూ కష్టపడితే, ఆమె ముఖాన్ని చూసి ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు. పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమే. అయితే దీనికి నేను బీజేపీని నిందించను, మనలోని అవకాశవాదులనే బాధ్యులను చేస్తాను. మనుషులన్నాక కనీస నైతికత, మనస్సాక్షి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో రేగిన ఈ అసమ్మతి జ్వాలలు ఎటు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us