Maharashtra New CM: మహారాష్ట్ర సీఎంగా తెరమీదకు కొత్తపేరు.. ఇంతకీ మురళీధర్ మోహోల్‌ ఎవరు?

|

Nov 30, 2024 | 4:42 PM

మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం... షిండే స్వగ్రామానికి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలలేదు.. కాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీ మాత్రం ఖరారయ్యింది. డిసెంబర్‌ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్‌ ప్రమాణం చేస్తుంది.

Maharashtra New CM: మహారాష్ట్ర సీఎంగా తెరమీదకు కొత్తపేరు.. ఇంతకీ మురళీధర్ మోహోల్‌ ఎవరు?
Mohol Murlidhar
Follow us on

మహా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్‌ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలలేదు.. కాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీ మాత్రం ఖరారయ్యింది. డిసెంబర్‌ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్‌ ప్రమాణం చేస్తుంది. ముంబై ఆజాద్‌ మైదాన్‌ వేదికగా ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారంటూ ప్రకటన విడుదలైంది.. డిసెంబర్‌ 3వ తేదీన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతుంది. అయితే ఫడ్నవీస్‌కే సీఎం పదవి దక్కుతుందా ? లేక అనూహ్యంగా కొత్త నేతకు బీజేపీ అవకాశం ఇస్తుందా ? ఈవిషయంపై క్లారిటీ రావడం లేదు. ఈ తరుణంలో కొత్త పేరు తెరపైకి రావడం, ఆ వ్యక్తి స్వయంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులుగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్ర నాయకత్వం మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్‌ను నియమిస్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపించాయి. దీనిపై వెంటనే.. మురళీధర్ మోహోల్‌ స్పందించారు.. X (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన పూణె ఎంపీ ఈ ఊహాగానాలు నిరాధారమైనవి.. కల్పితమంటూ కొట్టిపారేశారు.

“సోషల్ మీడియాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నా పేరు ప్రకటనపై ఊహాగానాలు నిరాధారమైనవి.. కల్పితం. బిజెపి నేత, మా నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడింది. మహారాష్ట్ర ప్రజలు కూడా చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చారు..” అంటూ పేర్కొన్నారు..

మురళీధర్ ట్వీట్..

‘‘బీజేపీలో సోషల్ మీడియా ఊహాగానాల ద్వారా కాకుండా పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుంది! ఒకసారి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటే, పార్టీ నిర్ణయమే మాకు సుప్రీం. అందుకే సోషల్ మీడియాలో నా పేరుపై ఊహాగానాలు అర్థరహితం.” అంటూ మురళీధర్ మోహోల్‌ క్లారిటీ ఇచ్చారు.

కాగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి 230 స్థానాల్లో భారీ ఆధిక్యం సాధించింది. బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు – ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.

మహా వికాస్ అఘాడి (MVA) కూటమి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.. శివసేన (UBT) 20 సీట్లు, కాంగ్రెస్ 16, NCP (శరద్ పవార్ వర్గం) 10 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.

చారిత్రాత్మకమైన ఫలితాన్ని పొందినప్పటికీ, ఓట్ల లెక్కింపు ముగిసిన ఏడు రోజుల తర్వాత మహాయుతి కూటమి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోలేదు. ఏక్‌నాథ్ షిండేను నియమించేందుకు బీజేపీ విముఖత చూపడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నారు. వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే-పాటిల్ వంటి ప్రత్యామ్నాయ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే.. ఫడ్నవీస్ సీఎంగా ఉంటారని.. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ఉంటారంటూ పేర్కొంటున్నారు.. దీనిపై క్లారిటీ రావాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..