
మీరట్, జులై 19: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పంవార్ (35) ఏడేళ్ల క్రితం 2019లో దామిని (30)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 150 మంది పిల్లలు ఉన్న ‘కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్’ను నిర్వహిస్తున్నారు. అయితే దామిని, ప్లే స్కూలు వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అలియాస్ నిక్కీతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. తమ సంబంధానికి అతుల్ అడ్డుగా మారడంతో పాటు, అతని పేరున ఉన్న రూ.20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని దామిని, ఆమె ప్రియుడు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో గత గురువారం (జులై 16) రాత్రి అతుల్‌కు దామిని పాలలో అధిక మోతాదులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తుషార్ తన ఇద్దరు సహచరులు సోను, ఉదయ్ కుమార్ సహాయంతో ఒక పామును ఇంటికి తీసుకొచ్చి అతుల్ పడుకున్న దుప్పట్లో వదిలారు. ఆ పాము కాటు వేయడంతో అతుల్ మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం ఉదయం దామిని తన భర్తను పాము కాటేసిందని చెబుతూ హస్తినాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి మంచంపై పాము కనిపించినప్పటికీ, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన కేవలం 24 గంటల్లోపే ఈ కేసును పోలీసులు చేదించారు. ఈ హత్యలో దామినితోపాటు ఆమెకు సహకరించిన ప్రియుడు, పామును ఆడించే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనా స్థలంలో పాము ప్రవర్తన సాధారణ పాము కాటు ఘటనలకు భిన్నంగా ఉండటంతో మొదటి నుంచే అనుమానాలు వ్యక్తమైనట్లు సీనియర్ పోలీసు అధికారి అభిజిత్ కుమార్ తెలిపారు. అనంతరం దామిని కాల్ డీటెయిల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించగా తుషార్‌తో ఆమె తరచూ సంప్రదింపులు జరిపిన విషయం బయటపడింది. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సుమారు 20 రోజుల క్రితం తుషార్, అతుల్‌ను ఎర్టిగా కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ ఘటనపై ఫిర్యాదు చేయకుండా దామిని అతడిని నిరుత్సాహపరిచినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తుషార్ మొబైల్ ఫోన్‌లో పాము ఫోటోను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో లభ్యమైన పామును పరీక్షల కోసం పంపించారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఈ కేసులో దామిని, తుషార్, సోను, ఉదయ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత పాము కాటుతో జరిగిన మరణంగా కనిపించిన ఈ ఘటన.. ఇప్పుడు భార్య, ఆమె ప్రియుడు, వారి సహచరులు కలిసి పన్నిన హత్య కుట్రగా మారడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.