
అన్నీ బాగుంటే ఎందుకెళ్తారు. ఏదో లోటు ఫీలవుతున్నారు. దేశంకాని దేశానికి ఎగిరిపోతే జీవితం కొత్త రెక్కలు తొడుగుతుందనుకుంటున్నారు. ఇక్కడ ఎంత కష్టపడ్డా లైఫ్‌స్టయిల్ పెద్దగా మారదనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో పన్నుపోటు లేని విధానాలు, ప్రశాంత జీవితాలు సంపన్నులను రారమ్మని ఆకర్షిస్తున్నాయి. ఈ జీవితానికి సంపాదించింది చాలనుకునేవాళ్లు కూడా తమకు నచ్చిన గమ్యాన్ని వెతుక్కుంటున్నారు. దీంతో భారత్‌నుంచి ఏటా సంపన్నుల వలసలు పెరుగుతూ పోతున్నాయి.
2024లో కనీసం 5,100 మంది భారత మిలియనీర్లు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఈఏడాది 4,300 మంది భారత్‌ని వీడే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక అంచనా వేసింది. వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని సంస్థ వెల్లడించింది. ఈ నివేదికలో మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్ మూడో స్థానంలో నిలిచింది.
2022-2024 మధ్య మూడేళ్లలో 18,300 మంది మిలియనీర్లు భారత్ నుంచి వలస వెళ్లారని అంచనా. వీరు దేశంలోనే పెట్టుబడులు పెట్టగలిగితే.. ఒక్కో మిలియనీర్ కనీస పెట్టుబడి 8.2 కోట్లుగా ఉంటుంది. అంటే సంపన్నుల వలసలతో మూడేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు లక్షా 50వేల కోట్ల సంపదను పరోక్షంగా నష్టపోయింది. భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపారావకాశాలు, పిల్లల విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఇండియన్ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్టు హెన్లీ నివేదిక వెల్లడించింది.
కొన్ని దేశాల్లో ఆర్థికంగా గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాలు ఉద్యోగాల సృష్టి, ప్రతిభ కోసమే కాకుండా కొత్తగా సంపదను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. తమ దేశానికి వచ్చే సంపన్నులకు వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం లక్షా 42వేల మంది సంపన్నులు స్వదేశాలు వీడే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య లక్షా 65వేలకు పెరగవచ్చని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 9,800 మంది మిలియనీర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నులను ఆకర్షించే దేశంగా యూఏఈ టాప్‌లో నిలుస్తోంది. పోయినేడాది వివిధ దేశాల నుంచి 6,700 మంది మిలియనీర్లు యూఏఈకి వలస వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా భారతీయ సంపన్నులను కూడా ఆకర్షిస్తోంది. UAE తర్వాత USA, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లేందుకు సంపన్నులు ఇష్టపడుతున్నారు.
దేశానికి చెందిన అత్యంత సంపన్నుల్లో 22 శాతం మంది విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. ప్రతి అయిదుగురు కోటీశ్వరుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూ, ఆతిథ్య దేశంలో శాశ్వతంగా నివసించాలనే ఉద్దేశంతో ఎక్కువమంది ఉన్నారు. 25 కోట్లకు పైగా నికర సంపద విలువ ఉన్న 150 మంది అధిక సంపన్నులు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వేలమంది మిలియనీర్లు దేశం వీడుతున్నా.. భారత్‌లో కొత్త సంపన్నులు పుట్టుకొస్తూనే ఉన్నారు. 2023 నాటికి భారతదేశంలో 2లక్షల 83వేల మంది అత్యంత సంపన్నులుగా ఉన్నారు. వీరి సంపద విలువ సుమారు 283 లక్షల కోట్లు. 2028 నాటికి అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 4లక్షల 3వేలకు పెరిగే అవకాశం ఉందని అంచనా. వారి సంపద విలువ 359 లక్షల కోట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. అందుకే ఎంతమంది సంపన్నులు వెళ్లిపోయినా.. భారత ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం పడదనే అభిప్రాయంతో ఉన్నారు నిపుణులు.