KIIT యూనివర్సిటీలో నేపాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. భారత్‌-నేపాల్‌ మధ్య దౌత్యపరమైన వివాదం.. అసలేం జరిగిందంటే..

|

Feb 20, 2025 | 9:39 AM

భువనేశ్వర్‌ KIIT యూనివర్సిటీలో నేపాలీ విద్యార్ధిని ఆత్మహత్య భారత్‌-నేపాల్‌ మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమయ్యింది. యూనివర్సిటీని వదిలి వందలాదిమంది విద్యార్ధులు నేపాల్‌కు తిరిగి రావడంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురిని భువనేశ్వర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

KIIT యూనివర్సిటీలో నేపాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. భారత్‌-నేపాల్‌ మధ్య దౌత్యపరమైన వివాదం.. అసలేం జరిగిందంటే..
KIIT University Incident
Follow us on

ఒడిశాలోని ప్రఖ్యాత కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) యూనివర్సిటీలో నేపాలీ విద్యార్ధిని ఆత్మహత్య వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. ఇది భారత్‌-నేపాల్‌ మధ్య దౌత్యపరమైన వివాదంగా మారింది. నేపాల్‌కు చెందిన ప్రకృతి లమ్సాల్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్ధినిని అద్విక్‌ శ్రీవాత్సవ అనే తోటి విద్యార్ధి పదేపదే శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ప్రకృతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై KIITలొ నిరసనలు వెలువెత్తాయి. ఈ గొడవ కారణంగా యూనివర్సిటీ నుంచి 800 మంది నేపాల్‌ విద్యార్ధులు తమ దేశానికి వెళ్లిపోయారు.. బలవంతంగా తమను వెళ్లిపోవాలని యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశించిందని ఆరోపించారు.

నేపాల్‌ ప్రభుత్వం ఆగ్రహం

అయితే ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై యూనివర్సిటీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందన్న ఆరోపణలు వచ్చాయి. సెక్యూరిటీ సిబ్బంది విద్యార్ధులపై దాడికి దిగడంతో ఈ గొడవ మరింత ముదిరింది. నేపాల్‌ విద్యార్ధులను దారుణంగా అవమానించారని వార్తలు రావడంతో ఆ దేశంలో కూడా నిరసనలు చెలరేగాయి. నేపాల్‌ ప్రధాని కోలి కూడా పార్లమెంట్‌లో ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో వివాదం మరింత రాజుకుంది. నేపాలీ విద్యార్ధులను యూనివర్సిటీ యాజమాన్యం ఘోరంగా అవమానించడంపై నేపాల్‌ ప్రభుత్వం మండిపడుతోంది. 40 వేల మంది యూనివర్సిటీ విద్యార్ధులు కట్టే ఫీజుతో నేపాల్‌ బడ్జెట్‌ సమానమన్న వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.

కాగా.. నేపాల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమైంది.. దీనిపై KIIT యాజామాన్యం క్షమాపణలు చెప్పింది.. ‘‘మా విద్యార్ధిని ప్రకృతి లమ్సాల్‌ అకాల మరణం మమ్మల్ని ఎంతో బాధించింది. ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాం.. ఆమెకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకున్నాం.. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్‌ చేశాం.. ఇద్దరు హాస్టల్‌ అధికారులతో పాటు ఓ ఉన్నతాధికారిని సస్పెండ్‌ చేశాం.. ముగ్గురు సీనియర్‌ సిబ్బందిని లీవ్‌లో పంపించాం..’’ అంటూ KIIT రిజిస్ట్రార్‌ రంజన్‌ మహంతి పేర్కొన్నారు.

వేధింపులపై ప్రకృతి పదేపదే యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఎవరు పట్టించుకోలేదని నేపాల్‌ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడు ఆద్విక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. విద్యార్ధులపై దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు యూనివర్సిటీ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

KIIT యూనివర్సిటీ యాజమాన్యంపై నేపాల్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఒడిశా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్రంలో తమ విద్యార్ధులు చదువుకోకుండా బ్యాన్‌ విధిస్తామని హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..