విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్‌లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్‌లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
Shuvendu Adhikari Government

Updated on: May 09, 2026 | 3:03 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్న వేలాది మంది కార్యకర్తలను భావోద్వేగానికి గురిచేసింది. ప్రధాని మోదీ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం మే 9వ తేదీని ఎంచుకోవడంలో ఒక విశిష్టత ఉంది. నేడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ, సువేందు అధికారి తొలుత ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బెంగాలీ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతామని సందేశాన్ని ఇచ్చారు. వేదిక అంతా కాషాయమయం కాగా, సువేందు అధికారి కూడా పూర్తి కాషాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి దేశంలోని ప్రముఖ నాయకులందరూ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు..

ముఖ్యమంత్రితో పాటు మరో ఐదుగురు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారు.

దిలీప్ ఘోష్: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు. ఖరగ్‌పూర్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్‌పై భారీ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అగ్నిమిత్ర పాల్: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన అగ్నిమిత్ర, అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహిళా గళానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె మంత్రి అయ్యారు.

అశోక్ కీర్తానియా: బంగావ్ ఉత్తర్ ఎమ్మెల్యే అయిన ఈయన మతువా వర్గానికి చెందినవారు. గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఈయనకు కేబినెట్‌లో చోటు దక్కింది.

క్షుదీరామ్ టుడు: గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రాణిబంధ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా మంత్రి పీఠాన్ని అధిరోహించారు.

నిసిత్ ప్రమణిక్: మాజీ కేంద్ర మంత్రి, కూచ్ బెహార్ ఎంపీ. మాతాతంగ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యత చేపట్టారు.

సువేందు అధికారి ప్రస్థానం అత్యంత సాహసోపేతమైనది. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న ఆయన, టీఎంసీ తీరుపై అసంతృప్తితో బీజేపీలో చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నందిగ్రామ్, భవానీపూర్) పోటీ చేసి రెండింటిలోనూ గెలుపొందారు. ముఖ్యంగా మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఆమెను 15,000 ఓట్ల మెజారిటీతో ఓడించడం ద్వారా తన సత్తా చాటారు.

ఏప్రిల్ 23 , 29 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. మే 4న వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. బ్రాహ్మణులు, మహిళలు, గిరిజనులు, మతువాలు, యువత బీజేపీకి అండగా నిలవడంతో ఈ భారీ విజయం సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. “సోనార్ బంగ్లా” (బంగారు బెంగాల్) నిర్మాణమే తమ లక్ష్యమని, అవినీతి రహిత పాలనను అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. నేటితో బెంగాల్ రాజకీయాల్లో సువేందు శకం అధికారికంగా ప్రారంభమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us