వలస కార్మికులకు సంబంధించిన డేటాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందజేయని కారణంగా కేంద్ర పథక ప్రయోజనాలను వారు పొందలేకపోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి అమిత్ మిత్రా ఖండించారు. ఆమె వ్యాఖ్యలు తనను షాక్ కి గురి చేశాయని, అవి నిరాధార ఆరోపణలని ఆయన అన్నారు. ఈ నెల 28 న బెంగాల్ ప్రజలతో నిర్వహించిన వర్చ్యువల్ ర్యాలీనుద్దేశించి మాట్లాడిన నిర్మల.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. వలస కూలీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సకాలంలో ఇవ్వని కారణంగా.. 50 వేల కోట్ల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన ప్రయోజనాలను వారు పొందలేకపోయారన్నారు. అలాగే ఈ రాష్ట్రానికి 10 వేల కోట్ల సాయాన్ని అందజేశామన్నారు. అయితే ఆమె చెప్పినవన్నీ అబధ్ధాలని అమిత్ మిత్రా పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వలస కార్మికుల డేటాను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కోరిన వెంటనే తమ ప్రభుత్వం ఈ నెల 23, 25 తేదీల్లో పంపినట్టు ఆయన వెల్లడించారు. పలు అంశాల్లో కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ లో దీదీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి.