Mamata Banerjee files Nomination: అనుకున్నట్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో జరగనున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక బరిలో నిలవనున్నారు. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో దీదీ శుక్రవారం వినాయక చవితి రోజునే నామినేషన్ వేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 3న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోభాందేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేసి విజయం సాధించారు. అయితే, నందిగ్రామ్‌లో మమత ఓడిపోయిన నేపథ్యంలో సోభాందేవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, భవానీపూర్ నుంచి దీదీ గతంలో రెండు సార్లు విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
అయితే, మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ కూడా బలమైన నేతను ఎంపిక చేసి బరిలోకి దించుతోంది. భవానీపూర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్‌ను బీజేపీ ప్రకటించింది. భవానీపూర్ ఉప ఎన్నికలో గెలవడం మమతా బెనర్జీకి చాలా క్లిష్టమైంది. ఈ ఏడాదిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 కైవసం చేసుకుంది. బీజేపీ 77 చోట్ల గెలుపొందింది. అయితే, నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన మమతా బెనర్జి.. బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీకి.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే భవానీపూర్ నుంచి టీఎంసీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన.. చటోపాధ్యాయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీని బరిలో నిలిపేందుకు ఆయన తన సీటును వదులుకున్నారు.
#WATCH West Bengal CM Mamata Banerjee files nomination for by-polls to Bhabhanipur seat
BJP and CPI-M have fielded Priyanka Tibrewal and Srijib Biswas respectively against the CM pic.twitter.com/LSvB1Zdfyk
— ANI (@ANI) September 10, 2021