
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం నాడు (జూన్ 29, 2026) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) రిజర్వేషన్లకు సంబంధించిన రెండు ముఖ్యమైన సవరణ బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులకు అనుకూలంగా 186 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, 17 మంది వ్యతిరేకించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ కొత్త చట్టాల అమలుతో రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల వ్యవస్థలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ముఖ్యంగా, రిజర్వేషన్ల విధానాన్ని ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడంతో పాటు, ఓబీసీ వర్గాలను పునర్వ్యవస్థీకరించారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మంత్రి గౌరీశంకర్ ఘోష్ అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. అందులో మొదటిది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల (ఎస్సీ, ఎస్టీలు మినహా) సర్వీసులు, పోస్టులలో ఖాళీల రిజర్వేషన్ సవరణ బిల్లు, 2026. రెండోవది పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ సవరణ బిల్లు, 2026. ప్రభుత్వ ఈ చర్య పూర్తిగా కలకత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉందని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని మంత్రి గౌరీశంకర్ స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి సర్వేలు ఏవీ లేకుండా గతంలో ఓబీసీ జాబితాలో చేర్చిన 113 వర్గాలను తాము తొలగించామని, అయితే వివిధ సర్వేల ఆధారంగా చేర్చిన 66 ఉప-వర్గాలను మాత్రం కొనసాగించామని మంత్రి సభకు వివరించారు. గత ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కమిషన్‌ను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్లే హైకోర్టు ఆ పాత ప్రక్రియను తిరస్కరించిందని, ఇకపై కమిషన్ విచారణ జరిపి ఇచ్చే సిఫార్సుల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సవరణ ద్వారా కమిషన్ నిర్మాణం, అధికారాలు, బాధ్యతలను కూడా స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సభలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే నౌషాద్ సిద్ధిఖీ మాట్లాడుతూ, ఈ సవరణ ఒక నిర్దిష్ట వర్గాన్ని ఏకాకిని చేసే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఏ సమాజానికైనా రిజర్వేషన్లు కల్పించే ముందు శాస్త్రీయ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ పరిమితిలో మార్పులు చేయాలంటే పక్కా సమాచారం, శాస్త్రీయ అంచనా అవసరమన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తగినంత సమాచారం లేకుండానే ఓబీసీ రిజర్వేషన్‌ను తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని ఆయన ఆక్షేపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..