West Bengal: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ.. నిండు సభలో తన్నుకున్న ఎమ్మెల్యేలు

|

Mar 28, 2022 | 8:52 PM

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీలో తన్నుకున్నారు అధికార టీఎంసీ , విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజు గందరగోళం నెలకొంది.

West Bengal: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ.. నిండు సభలో తన్నుకున్న ఎమ్మెల్యేలు
Bengal Assembly
Follow us on

West Bengal Assembly Meet: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీలో తన్నుకున్నారు అధికార టీఎంసీ(TMC) , విపక్ష బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజు గందరగోళం నెలకొంది. బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పాటు బట్టలు కూడా చిరిగిపోయాయి. బీర్భూమ్ అంశంపై చర్చకు డిమాండ్ చేయడంతో టీఎంసీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారని బీజేపీ ఆరోపించింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గపై దాడి జరిగింది. ఈ గొడవలో గాయపడ్డ టీఎంసీ ఎమ్మెల్యే మజుందార్‌ ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత శుభేందు అధికారి, మనోజ్ తిగ్గ, శంకర్ ఘోష్, దీపక్ బర్మన్, నరహరి మహతో సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసనకు దిగారు. బెంగాల్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. బీర్‌భూమ్‌ హింసపై రగడ జరిగింది. అనంతరం తృణమూల్‌ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తీవ్రగాయాలయ్యాయి. టీఎంసీ ఎమ్మెల్యే అసిద్‌ మజుందార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ టిగ్గా చొక్కా చినిగిపోయింది. వెల్‌వద్ద నిరసన చేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డులు తనపై దాడి చేసి నెట్టారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను తోసేశారని, బట్టలు చింపారని బీజేపీ నేత శుభేందు అధికారి అన్నారు. అంతకుముందు బెంగాల్‌ అసెంబ్లీలో భీర్‌భూమ్‌ ఘటనపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సభలో గొడవ చేశారని స్పీకర్‌ బీజేపీ పక్ష నేత సువేందు అధికారితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ బయట ఆందోళన చేశారు.

బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన బీజేపీ .. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తృణమూల్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు.

అసెంబ్లీలో తమకు రక్షణలేదని బీజేపీ పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ కొట్టిపారేశారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన తరువాత బీజేపీ కార్యకర్తలు కోల్‌కతాలో ఆందోళనలు నిర్వహించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు, ఇందులో బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఈ ట్వీట్‌తో మాల్వియా ఇలా రాశారు, ‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో రచ్చ. బెంగాల్ గవర్నర్ తర్వాత, TMC ఎమ్మెల్యేలు ఇప్పుడు రామ్‌పూర్‌హట్ ఊచకోతపై చర్చకు డిమాండ్ చేస్తున్నందున చీఫ్ విప్ మనోజ్ తిగ్గాతో సహా బీజేపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారు. అంటూ పేర్కొన్నారు.


Read Also..   TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ఖరారు.. ముందస్తుపై నజర్.. ఏప్రిల్ సభకు రాహుల్ గాంధీ!