కారు బాంబు దాడి.. 13 మంది సైనికులు మృతి! భారత్‌ చేసిందంటూ పాకిస్థాన్‌ ఆరోపణ.. విదేశాంగ శాఖ స్పందన

పాకిస్థాన్‌లోని వజీరిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. పాకిస్థాన్ సైన్యం ఈ దాడికి భారతదేశాన్ని బాధ్యత వహించాలని ఆరోపిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. దాడిలో అనేక మంది గాయపడ్డారు.

కారు బాంబు దాడి.. 13 మంది సైనికులు మృతి! భారత్‌ చేసిందంటూ పాకిస్థాన్‌ ఆరోపణ.. విదేశాంగ శాఖ స్పందన
Waziristan Suicide Bomber A

Updated on: Jun 29, 2025 | 8:40 AM

పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. కారు నిండా పేలుడు పదార్థాలతో పాకిస్థాన్‌ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ని ఢీ కొట్టడంతో ఈ భారీ పేలుదు సంభవించింది. ఈ దాడిలో 13 మంది పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. అయితే ఈ దాడి వెనుక భారత్‌ హస్తం ఉందని పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఆదివారం తీవ్రంగా ఖండించింది.

“జూన్ 28న వజీరిస్తాన్‌పై జరిగిన దాడికి భారతదేశాన్ని నిందిస్తూ పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనను చూశాం. ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తూ మేం తిరస్కరిస్తున్నాం” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఆత్మాహుతి దాడి జరిగింది. 13 మంది సైనికులను బలిగొన్న ఈ దాడిని ఫిట్నా-అల్-ఖవారిజ్ నిర్వహించిందని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక ప్రకటనలో తెలిపినట్లు ది డాన్ పతిక్ర నివేదించింది.

ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సైనిక కాన్వాయ్‌ని ఢీకొట్టాడు. ఈ దాడిలో 13 మంది సైనికులు మరణించారు, 10 మంది సైనిక సిబ్బంది, 19 మంది పౌరులు గాయపడ్డారని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ వజీరిస్తాన్‌లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని ది డాన్ పత్రిక తెలిపింది. తాజా బాంబు దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. కానీ, పాకిస్థాన్‌ మాత్రం భారత్‌పై అర్థంలేని ఆరోపణలు చేసింది.

2021లో కాబూల్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది, ఎక్కువగా భద్రతా అధికారులు మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి