Viral Video: విశాలంగా రహదారి.. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్లు.. ఆ రహదారిపై ప్రయాణిస్తుంటే ఎవరికైనా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. మరి అలాంటి ఆనంద సమయంలో ఒక్కసారిగా.. తాము ప్రయాణిస్తున్న రహదారిపై వంతెన కళ్లముందే కుప్పకూలితే, మనకు కొద్ది అడుగుల దూరంలోనే ఆ దృశ్యం సాక్షాత్కరిస్తే.. పరిస్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితినే కొందరు ప్రయాణికులు ఎదుర్కొన్నారు. అడుగు దూరంలోనే ఫ్లై ఓవర్ కుప్పకూలింది. కొండ గుట్టలపై నిర్మించిన ఆ రహదారి ఫ్లైఓవర్ కొట్టుకుపోయింది. దానిని గమనించిన వాహనదారులు.. వెంటనే అలర్ట్ అయి.. బతుకు జీవుడా అంటూ తమ బళ్లను వెనక్కి తిప్పుకున్నారు. ఈ భయానక ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో చోటు చేసుకుంది.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఫ్లైఓవర్ సగ భాగం కుప్పకూలింది. కల్కా-సిమ్లా జాతీయ రహదారి-5లోని ఫోర్-లేన్ టన్నెల్‌ను కలిపే హైవేపై ఈ ఫ్లై ఓవర్ ఉంది. ఇది కుప్పకూలడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కులు, కార్లు, ఇతర వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి. కళ్ల ముందే, సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ ఘటనతో టన్నెల్‌ను ప్రస్తుతం మూసివేశారు.
ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో ఆగస్టు 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సిమ్లా, మండి, కులు, మండి, కులు, ప్రాంతాలలో ఒక మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాంగ్రా, చంబా, సిర్మౌర్, సోలన్, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉనా, పరిసర ప్రాంతాలలో ఆగస్టు 14 నుండి 16 వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో సిమ్లా, మండి, కాంగ్రా, చంబా, సిర్మౌర్, సోలన్, బిలాస్‌పూర్, ఉనా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గం కనిపించకపోవడం, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, నదులలో నీటి మట్టం పెరగడం, రోడ్లు కూలిపోవడం వంటి సంభవించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..