20 ఏళ్ల ముందు రహదారిని వాడుకోకుండా గోడ కట్టారు.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది..

| Edited By: Ravi Kiran

Jan 31, 2024 | 5:12 PM

అగ్రవర్ణాలకు చెందిన వారి ఇంటి ముందు నుంచి నడిచి వెళ్లేటప్పుడు చెప్పులు చేత పట్టుకొని వెళ్లడం లేదా....తల దించుకుని వెళ్లడం ఇలాంటివి చూసుంటాం కదా.....అయితే ఇప్పటికి తమిళనాడు రాష్ట్రంలో దళితులను గ్రామంలోకి రానివ్వకుండా కట్టిన గోడ ఇరవై ఏళ్ల నుంచి అలాగే వుంది

20 ఏళ్ల ముందు రహదారిని వాడుకోకుండా గోడ కట్టారు.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది..
Representative Image
Follow us on

అగ్రవర్ణాలకు చెందిన వారి ఇంటి ముందు నుంచి నడిచి వెళ్లేటప్పుడు చెప్పులు చేత పట్టుకుని వెళ్లడం.! లేదా.! తల దించుకుని వెళ్లడం లాంటివి కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో దళితులను గ్రామంలోకి రానివ్వకుండా కట్టిన గోడ ఇరవై ఏళ్ల నుంచి అలాగే ఉంది. దళితులు ఈ గోడ దాటి గ్రామంలోకి రాకూడదు. అయితే గ్రామం దాటి వెళ్లాలనుకుంటే.. మాత్రం రెండు కిలోమీటర్లు కాలి నడకన నడిచి వెళ్లాలి. అయితే ఇప్పటికే ఆ గోడ కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా.. అమలులోకి రాలేదు. ఇంతకీ ఆ గోడ కధేంటో తెలుసుకోవాలంటే.. తమిళనాడు రాష్ట్రంలోని దేవేంద్రనగర్ అనే గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..

వివరాల్లోకెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లాలో నేటికి కులవివక్షత కొనసాగుతుంది. తిరుపూర్ జిల్లా అవినాసి పరిధిలోని సేవూర్ పంచాయతీ పరిధిలో దేవేంద్రన్ నగర్ గ్రామం ఉంది. ఈ గ్రామానికి అదే ప్రాంతానికి చెందిన వీఐపీ గార్డెన్ నివాసం మధ్య.. 20 ఏళ్ల క్రితం సుమారు కిలోమీటర్ల మేర ఐదు అడుగుల ఎత్తుతో గోడను నిర్మించారు. దీంతో దేవేంద్రన్ నగర్ ప్రాంత ప్రజలు ప్రధాన రహదారిపైకి వెళ్లేందుకు సులువుగా ఉన్న పంచాయతీ రోడ్లను వినియోగించుకోలేకపోతున్నారు.ఈ గోడ లేకపోతే ఈ గ్రామ ప్రజలు, ప్రధాన రహదారి ద్వారా వివిధ కంపెనీలలో పని చేయడానికి వీఐపీ గార్డెన్ ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు. కానీ గోడ కట్టడం వల్ల  గోడను దాటడానికి రెండు కిలోమీటర్లు చుట్టి నడిచి వెళ్లడం, లేదా ఆ గోడ ఎక్కి అవతలికి దూకి గ్రామస్థులు వెళ్తున్నారు. ఈ ఘటనపై దళిత సంఘాలు పోరాటం చేయడం, జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ వస్తోంది.

దళితుల నిరసనలతో గత నవంబర్‌లో గోడను కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేయగా.. అగ్రవర్ణాల ప్రజలు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఇదే తంతు గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. దేవేంద్రన్ నగర్ ప్రాంతంలోని ప్రజలు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా.. గోడ తొలగించడం లేదని, అధికారులు అగ్రవర్ణాల వారికీ మధ్దతుగా, దళితుల మీద దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ గోడ ఎప్పుడు కూలగొడతారని.. తమకు ఎప్పుడు ఈ కుల వివక్షత నుంచి విముక్తి కలిగిస్తారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడ కూల్చి వేస్తే రెండు కిలోమీటర్ల మేర మార్గం సుగమం కావడంతో పాటు నిత్యం నడిచి వెళ్లే బాధ తప్పుతుందని గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.