రీల్స్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు రీల్స్ చేస్తూ ప్రాణాలు కూడా కొల్పోయిన సంఘటనలు అనేకం చూశాం. ఇంకొందరు రీల్స్, వ్యూస్ కోసం మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటిదే ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ కొందరు యువకులు నోరులేని అందమైన పక్షి నెమలిని చిత్ర హింసలకు గురిచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధ్యప్రదేశ్‌లోని కట్నీ నుండి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు క్రూరమైన రీతిలో నెమలి ఈకలను పీకేయటం కనిపిస్తుంది. ఈ యువకుడు చేస్తున్న పనిని చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వైరల్‌గా మారిన వీడియోలో, ఒక యువకుడు కనికరం లేకుండా నెమలిని హింసిస్తున్నాడు. అంతేకాదు అతని చుట్టూ నెమలి ఈకలు కుప్పగా పడి ఉండటం కూడా వీడియోలో కనిపిస్తోంది. యువకుడు కెమెరా వైపు చూపిస్తూ నవ్వుతూ రాక్షసానందం పొందుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కిరాతక చర్యకు పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
#Bhopal: A man stripping the feathers off a peacock in #MadhyaPradesh‘s Katni has created a furore on social media.
Police have identified the accused and say they are looking for the accused.@Anurag_Dwary Video pic.twitter.com/r4tc4PoWk1
— Siraj Noorani (@sirajnoorani) May 21, 2023
అందిన సమాచారం మేరకు వైరల్ వీడియో ఆధారంగా యువకుడిని అటవీశాఖ గుర్తించింది. అతని పేరు అతుల్ కొహనేగా గుర్తించారు. ఈ వీడియోను అతుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్‌గా అప్‌లోడ్ చేశాడు. వ్యూస్ కోసమే ఇలా చేశాడని తేలింది. ఆ తర్వాత నెమలిని చంపేసి వండుకు తిన్నాడంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. వైరల్ వీడియోలో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించారు. అతనిపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో 20 నుండి 25 రోజుల పాతదని తెలిసింది.. నిందితుడైన యువకుడు కట్ని జిల్లాలోని రేతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతను గత 20 రోజులుగా ఇంటి నుండి పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. నిందితుడి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్టుగా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..