పౌరసత్వ చట్టం తాలూకు నిరసన సెగలు ఇంకా పొగలు కక్కుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని సీలంపూర్ లో మంగళవారం ఈ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున హింసకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. దాదాపు 2 వేల మంది నిరసనకారులు వారిపైన, బస్సులపైన రాళ్లవర్షం కురిపించారు. కార్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు, ఆందోళనకారులు గాయపడ్డారు. చెల్లా చెదరైన రాళ్లు, ఇటుక ముక్కలతో వీధులు నిండిపోయాయి. పోలీసులకు చెందిన రెండు బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ హింసాత్మక పరిణామాలతో ఆరు మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. ఈ నెల 15 న, 16 న కూడా జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల అనంతరం తిరిగి అదే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం ఇది రెండో సారి.