VP Dhankhar on Freebies: దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయడం గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సమాజంలో ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయడం, హామీలివ్వడం, పోటాపోటీ రాజకీయాలపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు అమలు చేయడం వ్యయ ప్రాధాన్యతలను మార్చుకోవడమే అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేబులకు భరోసా ఇవ్వడం కాదని.. ప్రజలను శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ధన్కర్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలంలో మానవహక్కుల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని వెల్లడించారు. మానవ హక్కుల్లో ప్రపంచంలో ఏ భాగం కూడా భారత్ మాదిరిగా విరాజిల్లడం లేదని.. మన నాగరికత, రాజ్యాంగ రూపకల్పన అనేవి మానవ హక్కులను గౌరవించడం, పరిరక్షించడం, పెంపొందించడంలో మన నిబద్ధతను చాటిచెబుతున్నాయని.. ఇవి భారత డీఎన్‌ఏలోనే ఉన్నాయని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ పేర్కొన్నారు.
ఉచిత పథకాల రాజకీయాలు కేవలం వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమేనని.. ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దిగ్గజ ఆర్థిక నిపుణుల ప్రకారం, ఉచితాలు అనేవి స్థూల ఆర్థిక స్థిరత్వం ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తాయని.. దీర్ఘకాలంలో జీవన ప్రమాణాలను మెరగుపరచడం, ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రోత్సాహం ఎంతగా ప్రభావితం చూపుతాయనే విషయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని ధన్కర్ అభిప్రాయపడ్డారు.
‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR) కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంట్నియో గుటెర్రెస్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..