
దేశానికి అతి ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అర్ధాంతరంగా రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆయన రాజీనామా అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి కోసం రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది.
సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు. హఠాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.
వృత్తిపరంగా న్యాయవాదిగా, తర్వాత రాజకీయాల్లో కీలకస్థానాలకు ఎదిగిన ధన్‌ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, అనంతరం 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే పదవీ కాలం ముగిసే ముందే రాజీనామా చేయడం ఆశ్చర్యకర పరిణామంగా మారింది.