Varinder Singh: బైసెప్స్‌ ఆపరేషన్‌ సమయంలో హార్ట్‌ఎటాక్‌.. మాజీ మిస్టర్‌ ఇండియా టైటిల్‌ విన్నర్ మృతి

ప్రముఖ బాడీ బిల్డర్, మాజీ మిస్టర్ ఇండియా టైటిల్ విజేత వరిందర్ సింగ్ ఘుమ్మన్ అనుకోని రీతిలో గుండెపోటుతో మరణించడం ఫిట్‌నెస్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పంజాబ్‌కి చెందిన వరిందర్ ఘుమ్మన్ (40) అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన బైసెప్స్‌కు సంబంధించిన ఆపరేషన్‌ కోసం ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ సమయంలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు.

Varinder Singh: బైసెప్స్‌ ఆపరేషన్‌ సమయంలో హార్ట్‌ఎటాక్‌.. మాజీ మిస్టర్‌ ఇండియా టైటిల్‌ విన్నర్ మృతి
Varinder Singh Ghuman

Edited By: Anand T

Updated on: Oct 09, 2025 | 10:35 PM

ఆయన బైసెప్స్‌కు సంబంధించిన ఆపరేషన్‌ కోసం ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ సమయంలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక మైనర్ ఆపరేషన్ కావడంతో అదే రోజు తిరిగి వస్తానని చెప్పారు. కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ఇక తిరిగి రాలేకపోయారు. ఈ వార్త ఆయన అభిమానులు, బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్ వర్గాల్లో తీవ్ర విషాదం నింపింది. వరిందర్ ఘుమ్మన్ భారతదేశపు తొలి IFBB ప్రో బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన ఆయన, అదే సంవత్సరం మిస్టర్ ఏషియా పోటీలో రెండో స్థానం సాధించారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత బృందానికి నాయకత్వం వహించిన ఘుమ్మన్, 2011లో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో విజయం సాధించారు. ఆయన క్రీడా ప్రస్థానమే కాకుండా నటనారంగంలో కూడా అడుగుపెట్టి తన ప్రత్యేకతను చాటారు. 2012లో వచ్చిన పంజాబీ చిత్రం కబడ్డీ వన్స్ అగైన్‌లో ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం 2014లో విడుదలైన హిందీ సినిమా టైగర్స్‌ ఆఫ్‌ సుందర్బన్‌లో నటించారు. 2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం మార్జీవన్‌లో కూడా ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

వరిందర్ ఘుమ్మన్ శాకాహార బాడీ బిల్డర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. భారీ కాయధారుడిగా, కఠినమైన శ్రమతో నిర్మితమైన శరీరంతో ఆయన బాడీ బిల్డింగ్ ప్రపంచంలో స్పూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచారు. శాకాహారంతోనూ బలమైన శరీరం నిర్మించవచ్చని చాటిన వారు చాలా తక్కువగా ఉంటే వారిలో ఘుమ్మన్ ముందు వరుసలో ఉన్నారు. బాడీ బిల్డింగ్‌పై ఆయనకు ఉన్న అంకితభావం, క్రీడాపట్ల ఆయన చూపిన నిబద్ధత, ఫిట్‌నెస్ రంగానికి ఆయన చేసిన సేవలన్నీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.